కర్నాటక టు పాలమూరు .. రాయచూర్​ నుంచి గుట్కా సప్లై

కర్నాటక టు పాలమూరు .. రాయచూర్​ నుంచి గుట్కా సప్లై
  • డబుల్​ రేట్లకు అమ్ముతున్న వ్యాపారులు
  • బార్డర్​లో నిఘా కొరవడడంతో మళ్లీ ప్రారంభమైన దందా

మహబూబ్​నగర్/మక్తల్, వెలుగు: నిషేధిత మత్తు పదార్థాల రవాణాపై ఆఫీసర్లు నిఘా పెట్టడం లేదు. అంతర్రాష్ట్ర బార్డర్ల నుంచి వీటిని తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కర్నాటక రాష్ట్రంలో తయారయ్యే గుట్కాను పెద్ద మొత్తంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తరలిస్తూ కొందరు అక్రమ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ దందాను కొసాగించేందుకు కొందరు ఆఫీసర్లను కూడా మేనేజ్​ చేస్తుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

డబుల్​ రేట్లకు అమ్మకాలు..

రాష్ట్రంలో గుట్కా, పాన్​ మసాలాలు నిషేధం. వీటిని విక్రయిస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తున్నారు. అయితే మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు, దేవరకద్ర, చిన్నచింతకుంట ప్రాంతాలు కర్నాటక సరిహద్దులో ఉన్నాయి. దీంతో అక్రమ వ్యాపారులు ఈ ప్రాంతాలకు నిషేధిత గుట్కా, పాన్​ మసాలాలు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాస్తవానికి గుట్కా, పాన్​ మసాలా ప్యాకెట్లు కర్నాటకలో ఒక రూపాయి నుంచి రూ.5 వరకు దొరుకుతున్నాయి. వీటిని వ్యాపారులు మహబూబ్​నగర్, నారాయణపేట ప్రాంతాలకు తరలించి డబుల్​ రేట్లకు అమ్ముతున్నారు. ఒక్కో గుట్కా ప్యాకెట్​ కంపెనీని బట్టి రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముతున్నారు. అయితే ఈ సరుకును వ్యాపారులు కర్నాటక నుంచి మీడియేటర్ల ద్వారా రహస్యంగా తెప్పించుకుంటున్నారు.

నాలుగు బార్డర్ల మీదుగా రవాణా..

కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్​ నుంచి ప్రధానంగా ఈ వ్యాపారం సాగుతోంది. కర్నాటకకు చెందిన మీడియేటర్ల ద్వారా వ్యాపారులు ఈ సరుకును తెప్పించుకుంటున్నారు. రాయచూర్​ నుంచి శక్తినగర్​ మీదుగా తెలంగాణలోని కృష్ణ మండలం టైరోడ్, మాగనూర్, మక్తల్, మహబూబ్​నగర్​ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే యాద్గిర్​ నుంచి నారాయణపేట, గుర్మిట్కల్​ నుంచి దామరగిద్ద ప్రాంతానికి, సైదాపూర్​ నుంచి ​ఇడ్లూర్, సంక్లాపూర్, సమస్తాపూర్​ మీదుగా ఊట్కూర్​కు సరుకును రవాణా చేస్తున్నారు. 

ఈ ప్రాంతాల్లో ఒక్క కృష్ణ మండలం వాసూనగర్​ వద్ద అంతర్రాష్ర్ట చెక్​పోస్టు ఉండగా, అక్కడ నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు ఈ చెక్ పోస్టు నుంచి కాకుండా, వ్యాపారులు కృష్ణ మండలం చేగుంట మీదుగా కూడా సరుకును రవాణా చేస్తున్నట్లు తెలిసింది. కొందరు వ్యాపారులు రాయచూర్​ నుంచి రైలు మార్గంలో మీడియేటర్ల ద్వారా కృష్ణ రైల్వేస్టేషన్​ వరకు ఈ సరుకును తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. 

అలాగే యాద్గిర్​ నుంచి జలాల్​పూర్ మీదుగా నారాయణపేటకు వస్తుండగా, జలాల్​పూర్​ వద్ద చెక్​పోస్టు లేకపోవడంతో ఈజీగా రవాణా చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెక్​పోస్టును ఏర్పాటు చేసిన ఆఫీసర్లు, ఎన్నికలు ముగియడంతో తనిఖీలు చేయడం లేదు. మరో రెండు చోట్ల అసలు తనిఖీలు లేకపోవడంతో అక్రమార్కులు నిషేధిత గుట్కా, పాన్​ మసాలాను భారీగా తీసుకొస్తున్నారు.

స్పెషల్​ డ్రైవ్ నిర్వహించట్లే..

రాష్ట్రంలో గుట్కా, పాన్​ మసాలా విక్రయాలు నిషేధించడంతో రెండేండ్ల కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. బ్యాచ్​లుగా ఏర్పడి ప్రతి షాపును తనిఖీ చేశారు. ముందస్తు సమచారంతో గుట్కా, పాన్​ మసాలాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. దీనికితోడు కర్నాటక ప్రాంతాల నుంచి వీటిని తరలించే వారిపై నిఘా పెట్టి, ఎక్కడికక్కడ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. అయితే ప్రస్తుతం ఆఫీసర్లు స్పెషల్​ డ్రైవ్​లు నిర్వహించడం లేదు.

నిఘా పెంచుతాం..

కర్నాటక నుంచి నిషేధిత గుట్కా, పాన్​ మాసాలాలు తరలిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే గుట్కా అమ్మే వ్యాపారులపై నిఘా పెట్టాం. బార్డర్లలో పోలీస్​ బందోబస్తు పెట్టి తనిఖీలు చేస్తాం. ఎవరైనా నిషేధిత గుట్కాలు, పాన్​ మసాలాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.

చంద్రశేఖర్, సీఐ, మక్తల్