- డ్యూటీలో చేరని కొత్త కమిషనర్.. డిప్యూటీ కమిషనర్ పోస్టు కూడా ఖాళీనే
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో కీలక శాఖల్లో ఆఫీసర్ల సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో బల్దియాలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. వర్షాకాలం, సీజనల్ డిసిజెస్ వచ్చే టైంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆయా డిపార్టమెంట్ల ఆఫీసర్లు అందుబాటులో లేరు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బల్దియాకు హెడ్అయిన మున్సిపల్కమిషనర్ బదిలీ కాగా కొత్తవారిని నియమించినా ఇంకా బాధ్యతలు తీసుకోలేదు.
డ్యూటీలో చేరని కమిషనర్
మొన్నటివరకు రామగుండం కమిషనర్‌గా పనిచేసిన సుమన్‌రావు హైదరాబాద్ బదిలీ అయ్యారు. అక్కడి నుంచి నాగేశ్వర్ఈ నెల 15న ఇక్కడికి పంపించారు. కాగా ఇది జరిగి వారమవుతున్నా ఆయన ఇంతవరకు డ్యూటీలో జాయిన్ కాలేదు. ఆయన ఇక్కడికి రాకుండా మరోచోటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తోంది. డిప్యూటీ కమిషనర్ నారాయణరావు కూడా ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. ఎస్‌ఈ చిన్నారావు 15 నుంచి మెడికల్ లీవులో ఉన్నారు. ఇద్దరు డీఈలలో ఒకరు కొత్తగూడెం బదిలీ కాగా, మరొకరు సెలవులో ఉన్నారు. కార్పొరేషన్ మొత్తానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) సుచరణ్మాత్రమే దిక్కయ్యారు. ప్రస్తుత వర్షాకాలంలో, వ్యాధులు ప్రబలే సమయంలో అత్యవసర విషయాలపై నిర్ణయాలు తీసుకునేవారే కరువయ్యారు. కార్పొరేటర్లతో పాటు ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాని స్థితిలో ఉన్నారు.
కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం
వర్షాకాలం వచ్చిందంటే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో శానిటేషన్, డ్రైనేజీ వంటి సమస్యలు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి వరద చేరి ముంపునకు గురవుతున్నాయి. ఈ టైంలో బల్దియా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే నిల్వ నీటిలో దోమల లార్వా వృద్ధి చెందకుండా శానిటరీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలి. చెత్త నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు వాటిని ఎత్తి డంపింగ్ యార్డుకు తరలించాలి. ఖాళీ ప్రదేశాల్లో ముళ్ళ పొదలు, చెట్లు లేకుండా యజమానులకు నోటీస్‌లు ఇవ్వాలి. ఇలాంటి సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన కార్పొరేషన్ ఉన్నతాధికారుల్లో కొందరు డ్యూటీలో చేరకపోగా, మరికొందరు సెలవుల్లో ఉండిపోయారు. ఈ క్రమంలో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో కార్పొరేటర్లు, ప్రజలు ఉన్నారు. నిత్యం కార్పొరేషన్ ఆఫీస్‌కు వచ్చి అధికారులెవరూ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై జరిగే రివ్యూకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి ఆఫీసర్లు హాజరవుతున్నా బల్దియా నుంచి ఒక్క ఆఫీసర్హాజరుకాకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని న్యూపోరట్ పల్లి, మేడిపల్లి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శనివారం పర్యటించారు. గతేడాది వరదలతో ఈ ప్రాంతాలు నీట మునగగా ప్రస్తుతం ఆ ప్రాంతాలలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన వచ్చారు. కలెక్టర్ వెంట కార్పొరేషన్‌కు చెందిన ముఖ్యమైన అధికారులెవరు లేకపోగా ఒక్క శానిటేషన్ నుంచి సూపర్ వైజర్ మాత్రమే ఉన్నారు. వర్షాకాలంలో ప్రజలు తమ బాధలు చెబుతుంటే వాటిని తీర్చడానికి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన ఆఫీసర్లు కనిపించకపోవడం గమనార్హం’.