ఖమ్మం టౌన్, వెలుగు : ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో డీడీవో లకు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుపై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయ పన్ను ముఖ్య ఆదాయ వనరు అని, ఆదాయపన్ను కింద వసూలయ్యే ప్రతి పైసా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చవుతుందని తెలిపారు. త్రైమాసిక టీడీఎస్ దాఖలు తప్పనిసరని చెప్పారు.
వేతన ఆదాయం కోసం ఫారం 24క్యూ, వేతనేతర ఆదాయం కోసం ఫారం 26క్యూ లో టీడీఎస్ లు ఇవ్వాలన్నారు. డీడీవోలు క్రిడెన్షియల్ ను రహస్యంగా ఉంచాలని చెప్పారు. బోగస్ పత్రాలతో ఆదాయపన్ను ఎగవేతదారులపై ప్రాసిక్యూషన్ తో పాటు, పెనాల్టీ అధిక మొత్తంలో ఉంటుందని హెచ్చరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీడీవోలకు ఆదాయపన్ను కు సంబంధించి రిటర్న్స్, త్రైమాసిక, వార్షిక రిటర్న్స్ ఎప్పుడు ఇవ్వాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను అధికారి చైతన్య, వివిధ శాఖల డీడీవోలు పాల్గొన్నారు.