రికమండెషన్ ..​ఆఫీసర్లకు టెన్షన్!

  •     ఈసీ దూకుడుతో ఆలోచనలో పడ్డ అధికారులు
  •     బదిలీతో పోలీసుల్లో కలవరం
  •     సంక్షేమ పథకాలు, తాయిలాల పంపిణీపై ఎమ్మెల్యేల్లో టెన్షన్​
  •     లబ్ధి అందకుంటే ఓట్లు ఎట్ల అని నేతల సందిగ్ధం

నిజామాబాద్, వెలుగు :  ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనే ఆఫీసర్లు, ఈసీ తీరుతో ఆలోచనలో పడ్డారు. లైన్​దాటి పనిచేస్తే వేటు వేస్తామని ఎన్నికల కమిషన్​ ఇచ్చిన వార్నింగ్​తో బేంబేలెత్తున్నారు. సీపీ స్థాయి అధికారినే ట్రాన్స్​ఫర్​చేయడంతో ఇప్పటికే గట్టి సంకేతాలు వెళ్లాయి. దీంతో పొలిటికల్ ​సిఫార్సులతో పోస్టింగులు తీసుకున్న ఆఫీసర్లు కలవరం చెందుతున్నారు. మరో వైపు సంక్షేమ పథకాల ఎన్నికల తాయిలాల పంపిణీపై లీడర్ల నుంచి వారికి ఒత్తిడి పెరుగుతోంది.

పైరవీల పోలీస్​ పోస్టింగ్​లు..

మూడేళ్లు ఒకే జిల్లాలో పనిచేసిన ఆఫీసర్లు లేదా జిల్లా స్థానికత ఉన్న అధికారులను సీఈసీ (ఎన్నికల​కమిషన్) ఆదేశాల మేరకు  జులైలో ట్రాన్స్​ఫర్లు చేశారు. ఈ బదిలీల తెరవెనుక లీడర్లు పెద్ద స్క్రీన్​ప్లే నడిపారు. ఎన్నికల టైమ్​లో తమకు అనుకూలంగా ఉండే ఇతర ప్రాంత ఆఫీసర్ల సమాచారాన్ని సేకరించి, స్థానికంగా పోస్టింగ్​లు ఇప్పించుకున్నారు. ఆగస్టు నెలారంభంలో బోధన్​ఏసీపీ కిరణ్​కుమార్​బదిలీ సంచలనం రేపింది. పొలిటికల్​బ్యాక్​గ్రౌండ్​తో తిరిగి అక్కడే జాయినయ్యారు. అర్బన్, ఆర్మూర్, బోధన్​లో బోగస్ ​ఓట్ల వ్యవహారం దుమారం రాజేసి ఈసీ కమిషనర్ ​వికాస్​రాజ్​కు ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది.

దీంతో ఆయన పరిశీలకురాలిగా గవర్నమెంట్​సెక్రెటరీ క్రిస్టినా జడ్​చోంగ్తూను నియమించారు. ఆమె ఇప్పటికే రెండుసార్లు జిల్లాను సందర్శించి ఓటర్​లిస్ట్ ను పరిశీలించారు. ఓటర్ల నమోదు విషయంలోనూ లీడర్ల నుంచి ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడి ఫేస్ ​చేశారు. ఒక రిటర్నింగ్​ఆఫీసరయితే తన వల్ల కాదని, బదిలీ చేయించాలని 20 రోజుల కింద ఎమ్యెల్యేను కోరడం చర్చాంశనీయమైంది. 

పథకాలపై గంపెడాశతో..

దళిత బంధు పథకం తమకు ఓట్లు గుమ్మరిస్తుందని బీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థులైన సిట్టింగ్​ ఎమ్మెల్యేలు గంపెడాశ పెట్టుకున్నారు. ఈ పథకం ఆశచూపే అనేక మందిని పార్టీలో చేర్చుకున్నారు. ప్రభుత్వం నియోజకర్గానికి 1100 యూనిట్లు మంజూరు చేయగా, అంతకు నాలుగింతలు దరఖాస్తులు వచ్చాయి. నెల రోజులు కష్టపడి తమ పార్టీ వారికే లబ్ధి చేకూరేలా ఎమ్మెల్యేలు లిస్ట్​ రూపొందించారు. జిల్లాలోని అయిదు సెగ్మెంట్లలో దళితబంధు ఫైనల్ ​లిస్టు సిద్ధమయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్​వచ్చింది.

ఆఫీసర్ల నుంచి షెడ్యూల్​కు మందు తేదీల్లో సెలక్షన్​ ప్రొసీడింగ్స్ ఇప్పించి, దళిత బంధు పంపిణీ చేద్దామని అనుకున్నారు. ఈ మేరకు తమ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. డబుల్​బెడ్​రూమ్ ​ఇండ్లపై ఇదే స్థాయిలో కసరత్తు జరిగింది. ఎన్నికల కోడ్​రావడంతో ఆయా పథకాల లబ్ధిదారుల పేర్లపై పాత తేదీల్లో ప్రొసీడింగ్స్​రూపొందించేందుకు ఆఫీసర్లు వెనకడుగు వేస్తున్నారు. విషయం ఈసీ దృష్టికి వెళ్తే తమకే ప్రాబ్లమ్స్​ఎదురవుతున్నాయని ఆలోచిస్తున్నారు.