- తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు చేపట్టని ఆఫీసర్లు
- అండర్ పాస్, ఫ్లైఓవర్ల కోసం పబ్లిక్ ధర్నాలు చేసినా స్పందన కరువు
మహబూబ్‌నగర్/బాలానగర్, వెలుగు : డేంజర్ స్పాట్లపై ఆఫీసర్లు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకోవడం లేదు. నేషనల్ హైవే మీదుగా ఉన్న గ్రామాలు, మండల కేంద్రాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఏటా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్ నుంచి షాద్‌నగర్ వరకు 160 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే 44 విస్తరించి ఉంది.
నాలుగు లేన్ల రోడ్డు కావడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు నిత్యం వందల కొద్ది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గంలో యాక్సిడెంట్లను నివారించేందుకు చాలా చోట్ల నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్‌లను ఏర్పాటు చేసింది. కానీ కొన్ని ఏరియాల్లో వ్యాపారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో రద్దీ చోట్ల అండర్ పాస్‌లు నిర్మించలేదు. వీటిని ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా ఎన్‌హెచ్-44తో కనెక్టివిటి ఎక్కువగా ఉండే బాలానగర్ మండల కేంద్రం, రాజాపూర్ మండల కేంద్రం, మూసాపేట మండలం జానంపేట వద్ద, కొత్తకోట బైపాస్ ఎంట్రెన్స్, ఎగ్జిట్ వద్ద, వెల్టూరు స్టేజీ, వేముల స్టేజీ, పొల్కంపల్లి స్టేజీ, కనిమెట్ట, ముమ్మాలపల్లి, విలియంకొండ, పాలెం, పెంజర్ల క్రాస్ రోడ్డు, ఆశన్న జంక్షన్, జేపీ దర్గా వెళ్లే రోడ్డు, కేశంపేట, సోలీపూర్ వై జంక్షన్ల డేంజర్ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ కచ్చితంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటి చేపట్టలేదు. ఫలితంగాఈ ఏరియాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇందుకు శుక్రవారం బాలానగర్ మండలం కేంద్రంలో జరిగిన ఘటననే ఉదాహరణ. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం అందరినీ కలచివేస్తోంది. సంత రోజు రోడ్డు దాటే వెహికల్స్ ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా లేరు. సంత జరుగుతున్న సమయంలో హైవేపై వాహనాలు, ప్రజలు క్రాసింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు ఆ ఏరియాలో ఒక్క పోలీసు కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లు లేకపోవడంపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పదేండ్ల కిందట మంజూరైనా..
బాలానగర్ మండల కేంద్రం జడర్ల నియోజకవర్గంలో అతి పెద్దది. ఈ మండలంలో అత్యధిక గిరిజన తండాలు ఉన్నాయి. బాలానగర్ సంతకు ఈ తండాల నుంచి వేలల్లో ప్రజలు వస్తారు. అయితే జాతీయ రహదారి నిర్మాణ సమయంలోనే ఫ్లైఓవర్‌తో పాటు అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కానీ, ఇక్కడి కొందరు వ్యాపారులు దీన్ని అడ్డుకున్నారు. ఫ్లైఓవర్, అండర్ పాస్‌లను నిర్మిస్తే తమ గిరాకీలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ నిర్మాణాలను
టేకప్ చేయలేదు.
ఆందోళనలు చేసినప్పుడే హడావుడి
యాక్సిడెంట్లు జరిగిన ప్రతిసారి ప్రజలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను ఏర్పాటు చేయాలని ఆందోళనలు, జాతీయ రహదారి దిగ్బంధం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం యాక్సిడెంట్లు జరిగినప్పుడు లీడర్లు వచ్చి హడావుడి చేయడం తప్ప ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు. ఇప్పటికైనా పాలకులు, ఆఫీసర్లు స్పందించి జాతీయ రహదారి పై అవసరం ఉన్న చోట్ల ఫైఓవర్లు, అండర్ పాస్‌లను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి
ఫ్లైఓవర్ శ్యాంక్షన్ అయినా కట్టట్లే..
బాలానగర్ వద్ద హైవేపై గతంలోనే ఫ్లైఓవర్ కట్టడానికి పర్మిషన్ వచ్చింది. కానీ కొందరు వ్యాపారులు గిరాకీలు దెబ్బతింటాయని దీన్ని అడ్డుకున్నారు. అప్పటి పొలిటికల్ లీడర్లతో మాట్లాడి ఈ పనులు జరగకుండా చేశారు. ఇప్పుడు ఫ్లైఓవర్ లేకపోవడంతో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ప్రజల ప్రాణాలకంటే వ్యాపారుల మాటకే విలువ ఇవ్వడం పట్ల పొలిటికల్ లీడర్లు, ఆఫీసర్లకు సిగ్గు ఉండాలి.
-
గిరి, బోడజానంపేట, బాలానగర్ మండలం
సంతకు రావాలంటే రోడ్డు దాటాల్సిందే..
బాలానగర్‌లో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. సంత హైవే ను ఆనుకొని ఉంటుంది. దీంతో సంతకు రావాలంటే ప్రతి ఒక్కరూఈ రోడ్డు దాటాలి. జెట్ స్పీడులో కార్లు, జీపులు, బస్సులు, లారీలు వస్తుంటాయి. వాటి స్పీడ్‌ను నియంత్రించేందుకు ఇక్కడ ఆఫీసర్లు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అండర్ పాస్, ఫ్లైఓవర్‌ను కూడా కట్టలేదు. దీంతో యాక్సిడెంట్లు జరిగిన ప్రతీసారి సంతకు వచ్చిన వారిలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. -
సాయి చరణ్, బాలానగర్