ఇవేం రోడ్లు?
- రహదారుల దుస్థితిపై సభ్యుల ఆందోళన
- మా పరిధి 600 కి.మీ. మాత్రమే
- ఏ రోడ్డు ఖరాబైనా జీహెచ్‌ఎంసీనే అంటున్నరు
- ఎస్‌ఆర్‌డీపీ మార్గాల్లో భారీ వెహికల్స్ వెళ్లడం వల్లే సమస్య
- వారం రోజుల్లో 4వేలకు పైగా గుంతలు పూడ్చాం
- బల్దియా కమిషనర్ దానకిశోర్
‘ప్రజా విజ్ఞప్తుల పరిష్కారంలో ఆఫీసర్లు మాట వింటలేరు.. సమస్యలు పరిష్కరిస్తలేరు’ అని కార్పొరేటర్లు ఆరోపించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన బల్దియా 11వ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. సిటీలో రోడ్లు అధ్వానంగా మారాయని, నాలాల విస్తరణ, పారిశుద్ధ్యం నిర్వహణ బాగాలేదని సభ్యులు మండిపడ్డారు. మేయర్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సమస్యలపై అధికారులను నిలదీ శారు. టీఎస్ ఐఐసీ కింద భూములిచ్చినా.. ఎమ్మార్ ప్రాపర్టీలోని విల్లాలకు బల్దియా అనుమతి లేదని, వాటిని ఎప్పుడు కూల్చేస్తారో చెప్పాలని ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బక్రీద్, గణేశ్ పండుగల ఏర్పాట్లు, క్రీడా సౌకర్యాలు, అక్రమ నిర్మాణాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల తర్వాత మేయర్ రూలింగ్ ఇచ్చారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజాప్రతినిధుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమాధానాలివ్వాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో వర్షకాలంలో పురాతన, శిథిల భవనాలు కూలి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందున వీటిని కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. గురువారం జీహెచ్‌ఎంసీ 11వ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి మేయర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని, నగరానికి మెరుగైన ర్యాంక్ వచ్చేలా సహకరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో స్వచ్ఛ, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఇటీవలే ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 105 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను 200లకు పెంచుతున్నట్టు తెలిపారు. 12 నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, రూ. 9.71 కోట్లతో మరో ఏడు షెల్టర్లను నిర్మిస్తున్నామన్నారు. నగర సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ ట్విట్టర్‌కు విశేష స్పందన లభిస్తోందని, దాదాపు లక్ష మందికి పైగా స్పందిస్తున్నారని మేయర్ వివరించారు.
–వాడీవేడిగా చర్చ
మేయర్ ప్రసంగం తర్వాత సభ్యులు వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీన్ జాఫ్రీ, ప్రభాకర్ రావు, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు ముంతాజ్ ఖాన్, కౌసర్ మొయినుద్దీన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్లు, ఎక్స్అఫిసియో సభ్యులు పలు సమస్యలను తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీలోని విల్లాలపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. అనుమతి లేకుండా నిర్మించిన విల్లాలను ఎప్పటిలోగా కూల్చివేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, నాలాల విస్తరణ, క్రీడా సౌకర్యాలు, బక్రీద్, గణేశ్ పండుగల ఏర్పాట్లు, అక్రమ నిర్మాణాలపై చర్చ జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంపై ఇచ్చే విజ్ఞాపనలను అధికారులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు ఫిర్యాదులు చేశారు.
రూ. 2.43 కోట్లతో పండుగ ఏర్పాట్లు
సభ్యులు లేవనెత్తిన అంశాలకు కమిషనర్ ఎం.దానకిశోర్ సమాధానాలు ఇచ్చారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లలో భాగంగా రూ.2.43 కోట్ల వ్యయంతో ప్రత్యేక లైటింగ్, జీవ వ్యర్థాల తొలగింపునకు చర్యలు చేపట్టామని తెలిపారు. వ్యర్థాల తొలగింపు కోసం 3.69 లక్షల బయో డిగ్రేడబుల్ బ్లాక్ కవర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జంతు వ్యర్థాలను ఎరువులుగా మార్చే ప్రక్రియను చేపడుతున్నట్టు తెలిపారు.
చెత్తను తొలగించేందుకు చార్మినార్ జోన్‌లోనే 50 జేసీబీలు, 94 మినీ టిప్పర్లు, హెవీ లోడ్వాహనాలను కేటాయించినట్టు వివిధ విభాగాల అధికారులు వివరించారు.
క్రీడల అభివృద్ధికి కోచ్ల నియామకం
ప్రశ్నోత్తరాల తర్వాత సమావేశం చివరలో మేయర్ బొంతు రామ్మోహన్ రూలింగ్ ఇచ్చారు. సమస్యలపై ప్రజాప్రతినిధులు చేసే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమాధానాలు ఇవ్వాలని మేయర్ ఆదేశించారు. క్రీడల్ని ప్రోత్సహించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖు క్రీడాకారులను కోచ్‌లుగా నియమిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ చేపట్టే క్రీడా కార్యకలాపాలపై కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
రోడ్ల దుస్థితిపై చర్చ
జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, హైదరాబాద్ మెట్రో రైలు, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహణలో ఉన్నాయని దానకిశోర్ తెలిపారు. ఎక్కడ రోడ్లు దెబ్బతిన్నా జీహెచ్ఎంసీ జవాబుదారీగా ఉండాల్సి వస్తోందన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా 2018–-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 600 లేన్ కిలో మీటర్ల పీపీఎం రోడ్లను వేస్తామని, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు 390 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాలకు రూ.400 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. ఎస్ఆర్డీపీ పనులు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితి మెరుగ్గా లేదన్నారు. వర్షాల వల్ల ఏర్పడ్డ గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చివేశామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో శాశ్వత నీటి సౌకర్యం కోసం రూ.2 వేల కోట్లతో 53 భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అంటువ్యాధుల నివారణకు 500 మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రూ.38.24 కోట్ల వ్యయంతో నాలాల్లో 4.78 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులు చేపట్టామని దానకిశోర్ కార్పొరేటర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.