యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయానికి ఆదాయం వస్తున్నా భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం ఆఫీసర్లు విఫలం అవుతున్నారని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధ హేమేందర్‌గౌడ్ విమర్శించారు. ఈవో, ఆఫీసర్ల తీరును నిరసిస్తూ బుధవారం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కలిసి పాతగుట్ట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవో గీతారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రయారిటీ ఇవ్వడం లేదన్నారు. కొండపైకి ఆటోలను నిషేధించడం వల్ల సుమారు 300 ఫ్యామిలీలు రోడ్డున పడడమే కాకుండా, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన నిధులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు గంట సేపు ధర్నాకు దిగడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి నచ్చజెప్పినా వినకపోవడంతో మున్సిపల్ పాలకవర్గం సహా, అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు దండబోయిన అనిల్, తాళ్లపల్లి నాగరాజు, ముక్కెర్ల మల్లేశం, బబ్బూరి మౌనిక, బూడిద సురేందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బబ్బూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ సీస కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు హేమేందర్ గౌడ్, బీర్ల మహేశ్ పాల్గొన్నారు.
గ్రూప్ 1 నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
సూర్యాపేట/నల్గొండ అర్బన్, వెలుగు : గ్రూప్ 1 నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ చెప్పారు. ఎగ్జామ్ నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎగ్జామ్ కోసం జిల్లా వ్యాప్తంగా 31 సెంటర్లు ఏర్పాటు చేశామని, 9,181 మంది క్యాండిడేట్లు ఎగ్జామ్‌కు హాజరుకానున్నారని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని సూచించారు. ఉదయం 8 గంటల వరకే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని, 8.30 గంటలకు బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుందన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 62814 92368 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఈవో అశోక్ పాల్గొన్నారు.
నల్గొండలో 52 సెంటర్లు
నల్గొండ అర్బన్, వెలుగు : గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణపై లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్గొండ జిల్లాలో 16,084 మంది హాజరుకానున్నారని, వీరి కోసం 52 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తేవొద్దని, షూ కూడా వేసుకురావొద్దన్నారు. క్యాండిడేట్లు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం లేకుంటే గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్ట్ చేసి మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, అండర్ టేకింగ్ అందజేయాలని సూచించారు. సమావేశంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్‌రావు, అడిషనల్ ఎస్పీ అశ్వక్ అహ్మద్, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
గట్టుప్పల్ లో కోమటిరెడ్డి లక్ష్మి ప్రచారం
చండూరు, వెలుగు : అభివృ-ద్ధి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, మునుగోడులో కాషాయ జెండా ఎగురవేయాలని కోమటిరెడ్డి లక్ష్మీరాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుటుంబ పాలనను అంతం చేయడం బీజేపీతోనే సాధ్యం అవుతుందనే రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీలో చేరారన్నారు. కాంట్రాక్టుల కోసం అమ్మడుపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి మునుగోడు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కరోనా టైంలో సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. గట్టుప్పల్ మండలం కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసినా పట్టించుకోని ప్రభుత్వం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయగానే మండలం ప్రకటించారన్నారు. అనంతరం తేరటుపల్లి, కమ్మగూడెం, కొండాపురం గ్రామాల్లో ప్రచారం చేశారు.
రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం నేరమా ?
చండూరు, వెలుగు : టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, ఉచిత కరెంట్ ఇవ్వడం నేరమా అని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్‌రావు ప్రశ్నించారు. నల్గొండ జిల్లా చండూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు తమకు కూడా కావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అడుగుతున్నారని, అందుకే టీఆర్‌ఎస్‌పై బీజేపీ కక్ష కట్టిందని ఆరోపించారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్ క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులకు తోడు బీజేపీ కుట్రతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. టీఆర్‌ఎస్
క్యాండిడేట్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీజేపీ బలాన్ని పరీక్షించుకునేందుకే ఉపఎన్నిక
నల్గొండ, వెలుగు : బీజేపీ తన బలాన్ని పరీక్షించుకునేందుకే ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉప ఎన్నిక రుద్దిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. వాపును చూసి బలుపు అనుకుంటున్న బీజేపీ మునుగోడులో డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేస్తోందన్నారు. నల్గొండలోని తన క్యాంప్ ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఒక్కో మండలంలో రోజుకు రూ. 3.80 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అమిత్ షా రెండు, మూడొందల కోట్లు పంపతున్నట్లు ప్రజలు అనుకుంటున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా, రూపాయి విలువ పతనమైనా, చైనా ఆక్రమణ, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పట్టించుకోని కేంద్రం చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేసీఆర్‌ను ఏదో ఒక కేసులో ఇరికించి, జాతీయ రాజకీయాల్లోకి రాకుండా చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎత్తిపోతలు, రిజర్వాయర్లు పూర్తి కావాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు.
కోవర్టుల్లా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్
నల్గొండ అర్బన్, వెలుగు : కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలోని తన ఇంట్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. 2005 నుంచి 2014 వరకు కేటీఆర్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఈ విషయం రాష్ట్రంలోని ఏ ఒక్కరిని అడిగినా చెబుతారన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అడ్డుపెట్టుకొని కోమటిరెడ్డి బ్రదర్స్ కాంట్రాక్టులు, పదవులు పొందారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజిలు, నిమ్స్ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మునుగోడు ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.లతీఫ్, పోలె వెంకటాద్రి, పోలోజు వెంకటాచారి, కర్ణాటి మల్లేశ్, అలుగుబెల్లి సైదిరెడ్డి, కంచర్ల శ్రవణ్‌గౌడ్, కొండాపురం అరుణ్, పెరిక దివాకర్ పాల్గొన్నారు.
రాజగోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి
చౌటుప్పల్, వెలుగు : మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు సూచించారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో బుధవారం నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్‌స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థించాలని సూచించారు. ఎన్నికల ప్రచారం కోసం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలిసి చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ప్రచారం చేశారు. కార్యక్రమాల్లో లీడర్లు కూన శ్రీశైలంగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, నందకుమార్ యాదవ్, రాఘవుల నరేందర్, ఉపేందర్‌గౌడ్ పాల్గొన్నారు.