- ఫీజు ఎక్కువగా ఉందంటున్న లబ్ధిదారులు
- మార్కెట్ ఫీజు కంటే తక్కువేనంటున్న ఆఫీసర్లు
- జీవో 59 దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లనున్న ఆఫీసర్లు
- మండలానికి 10 మందితో ఫీజు కట్టించడమే టార్గెట్
ఖమ్మం, వెలుగు: నామమాత్రపు ఫీజుతో తమ స్థలాలు రెగ్యులరైజ్ అవుతాయని భావించిన వారు ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం ఫీజు నిర్ణయించడంతో ఇబ్బంది పడుతున్నారు. లక్షలకు లక్షలు చెల్లించాల్సి రావడంతో వెనకాడుతున్నారు. దీంతో ఇండ్ల ప్లాట్లు, భూముల రెగ్యులరైజేషన్ కోసం జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారితో ఫీజు చెల్లించేందుకు ఆఫీసర్లు కష్టపడాల్సి వస్తోంది. గతేడాది మార్చి నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్లో అధికారులు డిమాండ్ నోటీసులు పంపించారు. నిర్ణయించిన ఫీజును జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మూడు విడతలుగా చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే ఒకే విడతలో చెల్లించేందుకు కూడా ఆప్షన్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మార్కెట్ ధరకు సమానంగా ఉందనే అభిప్రాయాన్ని లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. తొలి విడత ఫీజు చెల్లించాల్సిన గడువు జనవరిలో ముగిసినా కొందరు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మంది రూ.50 కోట్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ.కోటి కూడా కట్టలేదని సమాచారం. దీంతో మండలాల వారీగా లబ్ధిదారులను కలిసి రెగ్యులరైజేషన్ చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించాలని నిర్ణయించారు.
భారీగా దరఖాస్తులు..
జిల్లాలో 59 జీవో కింద 3 వేల అప్లికేషన్లు వచ్చాయి. 125 గజాలకు మించి 150 గజాల్లోపు స్థలంలో ఇండ్లు కట్టుకున్న వారు కనీస ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 250 గజాల్లోపు ఇండ్లు నిర్మించుకుంటే ఆ ఏరియాలో ప్రభుత్వ ధరలో 25 శాతం కనీస ధరను, 251 నుంచి 500 గజాల్లో ఇండ్లు కట్టుకుంటే 50 శాతం కనీస ధరను, 500 నుంచి 1000 గజాల్లోపు ఇల్లు నిర్మించుకుంటే 75 శాతం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో వచ్చిన 2000 అప్లికేషన్లలో 90 శాతం వరకు 250 గజాల్లోపువే ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఇప్పటికే ఫీల్డ్ విజిట్ చేసిన అధికారులు, ఆస్తి పన్ను చలాన్, కరెంటు, నీటి బిల్లులను పరిశీలించి అది కమర్షియల్ భవనమా, లేక నివాస గృహమా అనేది తేల్చారు. రెగ్యులరైజేషన్ కు అప్లై చేసుకున్న స్థలం ప్రభుత్వ అభ్యంతరకర భూముల జాబితాలో ఉన్నాయా లేదా అనేది పరిశీలించి వెరిఫికేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత దరఖాస్తుదారులకు డిమాండ్ నోటీసులు పంపించారు. ఇండ్ల స్థలాలను క్రమబద్దీకరించుకుంటే భూముల విలువ పెరగడంతో పాటు భవిష్యత్లో బ్యాంకు లోన్లు వస్తాయని, అమ్ముకునేందుకు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న వారు డిమాండ్ నోటీసుల్లో వచ్చిన ఫీజు మొత్తాన్ని చూసి షాక్ తిన్నారు. మార్కెట్ రేటుకు సమానంగా ప్రభుత్వ ఫీజు ఉందనే విమర్శలు, ఫిర్యాదులు వచ్చాయి. అయితే ప్లాట్ ఉన్న సర్వే నెంబర్లో రీసెంట్ గా జరిగిన రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఫీజు నిర్ణయించామని ఆఫీసర్లు చెబుతున్నారు.
మోటివేట్ చేయాలని నిర్ణయం..
డిమాండ్ నోటీసులు అందుకున్న వారు జనవరిలో మొదటి విడత ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే సరైన రెస్పాన్స్ రాకపోవడంతో గడువును ఫిబ్రవరి 20కి మార్చారు. కల్లూరు డివిజన్లో 870 అప్లికేషన్లు రాగా, 42 మంది మాత్రమే మొదటి విడత ఫీజు చెల్లించారు. ఫీజు ఎక్కువగా నిర్ణయించారనే ఫిర్యాదుల నేపథ్యంలో పొరపాటు జరిగిన కొన్నింటిని తప్పించి, మిగిలిన అన్ని దరఖాస్తులకు ఫీజుల్లో మార్పు ఉండదని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రతి మండలంలో కనీసం 10 మందితో ఫీజు మొత్తం చెల్లించేలా మోటివేట్ చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇటీవల మండల రెవెన్యూ అధికారులతో జరిగిన మీటింగ్ లో ఫీజుల చెల్లింపుపై కలెక్టర్ వీపీ గౌతమ్ సమీక్షించారు. దరఖాస్తు చేసుకున్న వారిని మోటివేట్ చేసి, ప్రస్తుతం ఉన్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అతి తక్కువ ధర నిర్ణయించి పట్టా అందిస్తున్నామని తెలియజేయాలని ఆదేశించారు. రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా ఆ స్థలాలపై సంపూర్ణ హక్కు పొంది రిజిస్ట్రేషన్, బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 20లోగా కనీసం మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించేలా చొరవ చూపాలన్నారు. చెల్లింపులపై ప్రతీ వారం సమీక్షిస్తానని తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును కాస్త తగ్గిస్తే బాగుంటుందని దరఖాస్తుదారులు అంటున్నారు.
నోటీసులు రివైజ్ చేయాలి..
59 జీవో ద్వారా నామమాత్రపు రుసుముతో స్థలం రెగ్యులరైజ్ అవుతుందని అనుకున్నాం. రూ.29 లక్షలు చెల్లించాలని డిమాండ్ నోటీస్ వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించలేదు. ప్రభుత్వం పునరాలోచించి డిమాండ్ నోటీసులను రివైజ్ చేయాలి.
-ముదిగొండ వెంకటేశ్వరరావు, సత్తుపల్లి