యాదాద్రికి చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు 

  • యాదాద్రికి 2.76 కోట్ల చేప పిల్లలు.. 38 లక్షలు రొయ్యలు
  • 700 చెరువుల్లో వేయాలని నిర్ణయం
  • చేప పిల్లల కోసం 15 నుంచి టెండర్లు 

యాదాద్రి, వెలుగు : చేప పిల్లల పంపిణీకి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వానాకాలంలో చెరువులు నిండగానే చేప పిల్లలను విడుదల చేసే విధంగా ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. చెరువుల కెపాసిటీని బట్టి చేప పిల్లలను విడుదల చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 161 పెద్ద చెరువులు, 622 చిన్న చెరువులతోపాటు 22 మూసీ పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఈ చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టుకోవడం ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు.

దీంతో 2016లో అప్పటి బీఆర్ఎస్​ సర్కారు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ వాటిని చెరువుల్లో వదిలి పెట్టేలా చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏటా సెప్టెంబర్​లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​ సర్కారు కూడా చేప పిల్లల పంపిణీపై నిర్ణయం తీసుకుందని మత్స్య శాఖాధికారులు తెలిపారు. 

జిల్లాలో 3.14 కోట్ల చేప పిల్లలు..

జిల్లాలోని 700 చెరువుల్లో చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయం తీసుకుంది. 658 చెరువుల్లో 2.76 కోట్ల చేప పిల్లలు, 42 చెరువుల్లో 38 లక్షల రొయ్య పిల్లలను వదలాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 60 శాతం నీరున్న చెరువుల్లో వంద శాతం చేప పిల్లలను వదుల్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.

కాగా ప్రస్తుతం జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకు పెద్ద వానలు పడలేదు. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో 145.7 మిల్లీ మీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, ఇప్పటివరకు 128.4 మిల్లీ మీటర్లు నమోదై.. 12 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది.  వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే పంపిణీ చేసే చేప పిల్లల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 

ఆన్​లైన్​ టెండర్లు..

ప్రతీ సీజన్​లో మాదిరిగా ఈసారి కూడా రాష్ట్రస్థాయిలో ఆన్‌లైన్‌ టెండర్లను పిలిచారు. ఈ నెల 15 నుంచి ఆన్​లైన్​లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమై 23న ముగుస్తుంది. అనంతరం టెండర్లను జిల్లాల వారీగా తెరవనున్నారు.  కాగా 20 రోజుల వయసున్న 35 మిల్లీ మీటర్ల చేప పిల్లలకు 62 పైసలు, 100 మిల్లీ మీటర్లు ఉన్న వాటికి రూ.1.65  పైసల ధర నిర్ణయించినట్టు తెలిసింది. ఈ టెండర్‌లో ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అనుగుణంగా వచ్చిన టెండర్లను ఖరారు చేయనున్నారు. 

జిల్లాలో 184 మత్య్స సహకార సొసైటీలు..

జిల్లాలో మొత్తం 184 మత్య్స సహకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో మహిళా సంఘాలు పది ఉన్నాయి. మొత్తం సంఘాల్లో కలిపి 10,458 మంది మెంబర్లు ఉన్నారు.  గ్రామాల పరిధిలోని చెరువుల్లో వీరు చేపలు పట్టుకొని ఉపాధి పొందుతారు. చేప పిల్లల పంపిణీ కోసం టెండర్ల ప్రాసెస్​మొదలైందని జిల్లా మత్స్యశాఖ ఆఫీసర్​ రాజారాం తెలిపారు.