ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాను ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారు. పర్మిషన్లు లేకుండా ల్యాండ్ డెవలప్ మెంట్ పనులు చేస్తున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. లే అవుట్ పర్మిషన్లు లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయొద్దని, డీటీసీపీ అనుమతి లేకుండా భూమిలో అభివృద్ధి పనులు చేయొద్దని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించినా అధికారులు, రియల్టర్లు పట్టించుకోవడం లేదు. వందల ఎకరాల భూములను రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు. ఇటీవల నేలకొండపల్లి పర్యటన సమయంలో కలెక్టర్ వెంచర్లను గుర్తించి పర్మిషన్ లేకుండా రాళ్లు వేయడం, అర్చీలు కట్టడం, రోడ్లు వేయడంపై సీరియస్ అయ్యారు. వాటిని తొలగించి హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. ఆఫీసర్లు ఒకట్రెండు వెంచర్లలో హద్దు రాళ్లు పీకేసి హడావుడి చేశారు. తెల్లారే మళ్లీ ఆ బోర్డులను పీకేసి పనులు కంటిన్యూ చేస్తున్నారు. అధికారులకు మామూళ్లు ముట్టడంతోనే ఆ తర్వాత వెంచర్ నిర్వాహకులపై యాక్షన్ తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
సుడా పరిధిలోనూ ఇదే దందా..
ఖమ్మంలో స్తంభాద్రి డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోనూ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. గ్రీన్ బెల్ట్ కోసం కేటాయించిన స్థలాలను కూడా అమ్ముకుంటున్నారు. 60 వెంచర్లలో రూ.50 కోట్ల విలువైన గ్రీన్ బెల్ట్ స్థలాలను, రోడ్డు కోసం కేటాయించిన ప్లేస్ ను ప్లాట్లుగా అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. 2019లో సుడా ఏర్పాటైనప్పటి నుంచి 248 వెంచర్లు ఏర్పాటు చేయగా, వీటిలో 370 ఎకరాల గ్రీన్ బెల్ట్ ఏరియా ఉండాలి. ఇందులో 45 ఎకరాల గ్రీన్ బెల్ట్ స్థలాన్ని అమ్ముకున్నట్టు ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. జుజ్జులరావుపేటలోని వెంచర్ లో నాగార్జున సాగర్ కాల్వకి చెందిన ఎకరంన్నర భూమిని, మరికొంత అసైన్డ్ భూమిని కలుపుకొని డెవలప్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక వీటిపై అధికారికంగా స్పందించేందుకు మాత్రం ఆఫీసర్లు ముందుకు రావడం లేదు. రాతపూర్వకంగా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని కామెంట్ చేస్తున్నారు.