
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు సంబంధించిన కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఎన్నికలు ఈనెల 28న జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు కార్పొరేట్ సేఫ్టీ జనరల్ మేనేజర్ కె.గురువయ్య ఛీప్ ఎలక్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈనెల 12 నుంచి 19 వరకు ఎస్‌సీసీఎల్ బ్రాంచ్ కమిటీ, ఏరియా కమిటీల వారీగా నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. మొత్తం 2,300 మంది ఆఫీసర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.
కాగా, గతంలో ఏరియాల వారీగా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ కమిటీలు సింగరేణి బ్రాంచ్ కమిటీని ఎన్నుకునేవి. ప్రస్తుతం 30 ఏండ్ల తర్వాత డైరెక్ట్ గా ఎన్నికలు జరుగుతుండగా సింగరేణి బ్రాంచ్ కమిటీకి, ఏరియా కమిటీకి వేర్వేరుగా ఓటు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి బ్రాంచ్ కమిటీతో పాటు ఏరియాల వారీగా కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3, భూపాలపల్లి, జైపూర్ ఎస్టీపీపీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి కమిటీలకు ఈనెల 28న ఎన్నికలు జరగనున్నాయి.