
- బీఆర్ఎస్ హయాంలో కబ్జాదారులకు సహకారం
- ఆయా కేసుల్లో అడ్డంగా ఇరుక్కుంటున్న తహసీల్దార్లు, ఎస్సారెస్పీ ఆఫీసర్లు
- అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ భూకబ్జా కేసుల్లో కమిషనరేట్ పోలీసులు మరోసారి కొరఢా ఝలిపిస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులను లోతుగా విచారించి కబ్జాదారులను కటకటాల్లోకి పంపుతున్నారు. మెజారిటీ భూకబ్జా కేసుల్లో ఆఫీసర్ల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు పోలీసుల చేతికందడంతో వారిని సైతం అరెస్ట్చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఇటీవల కరీంనగర్‌లో నమోదైన రెండు కేసుల్లోనూ రెవెన్యూ, ఎస్సారెస్పీ ఆఫీసర్ల పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సారెస్పీ ఈఈ, సూపరింటెండెంట్, తహసీల్దార్, ఆర్ఐని విచారించి ఊచలు లెక్కబెట్టించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. వచ్చే వారంలో వివిధ కబ్జా కేసుల్లో మరిన్ని అరెస్టులు ఉండవచ్చని చెప్తున్నారు.
ఆఫీసర్ల సహకారంతోనే అక్రమాలు
బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్కేంద్రంగా జరిగిన భూకబ్జాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నకిలీ పేపర్లు సృష్టించి ఇతరుల భూములను ఆక్రమించడం, స్థలం యజమానికి తెలియకుండానే వేరొకరికి అమ్మేయడం, తక్కువ ధరకు భూమి అమ్మేలా ఒత్తిడి చేయడం.. లాంటి ఫిర్యాదులు రావడంతో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఎంక్వైరీ చేయిస్తున్నారు.
కబ్జాదారులకు అప్పటి పోలీసులు, రెవెన్యూ, ఎస్సారెస్పీ ఆఫీసర్లు సహకరించినట్లు విచారణలో గుర్తించారు. నకిలీ పేపర్లు సృష్టించడమే కాకుండా దానిని ఉపయోగించి భూమిని ఆక్రమించినందుకు కొత్తపల్లి మాజీ తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్‌ను గతేడాది మార్చిలో పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పేపర్లతో చింతకుంటలో భూమిని ఆక్రమించడంలో సహకరించినందుకు కొత్తపల్లి మాజీ తహసీల్దార్ మోహన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు.
తాజాగా కరీంనగర్‌లో తల్లిని, సోదరిని మోసం చేసి అక్రమంగా తన తండ్రి పేరిట ఉన్న ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న జోరెపల్లి ప్రదీప్‌రెడ్డికి సహకరించిన కరీంనగర్ అర్బన్ అప్పటి తహసీల్దార్, సెకండ్ ఆర్ఐపైన కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. వీరిద్దరు తప్పుడు పద్ధతిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఈ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు సాక్షి సంతకాలు, అఫిడవిట్లు ఇచ్చినందుకు మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపైనా ఎంక్వైరీ చేస్తున్నారు.
కరీంనగర్ కట్టారాంపూర్‌లోని సర్వే నంబర్ 954లో బూర్గుపల్లి వెంకటేశ్వర్‌రావుకు చెందిన 38 గుంటల భూమిని పంతంగి రామచందర్‌రావు, మహ్మద్ బషీర్, బొల్గవేణి శంకర్, బల్మూరి విజయ్ సహా 11 మంది వ్యక్తులు నకిలీ పేపర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సదరు నిందితులకు నిబంధనలకు విరుద్ధంగా ఎస్సారెస్పీ ఈఈ, సూపరింటెండెంట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) జారీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసులో నిందితులైన మహ్మద్ బషీర్, బల్మూరి రమణారావు, దాసరి సంజీవరెడ్డి, దాసరి బుచ్చిమల్లారెడ్డిని ఈ నెల 14న అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్సారెస్పీ ఈఈ, సూపరింటెండెంట్ పాత్రపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ నలుగురు ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చి త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిసింది.
యాక్టివ్ మోడ్‌లోకి ఎకనమిక్ అఫెన్స్ వింగ్
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు స్వీకరించాక కొన్నాళ్లకు ఎకనమిక్ అఫెన్స్ వింగ్(ఈవోడబ్ల్యూ) పేరిట నిరుడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ వింగ్‌లో భూకబ్జాదారులు, లీడర్లు, చిట్‌ఫండ్ నిర్వాహకులకు సంబంధించిన ఆర్థిక నేరాలు, భూకబ్జాలపై ఫిర్యాదులు స్వీకరించారు.
దీంతో చాలా ఏళ్లుగా తమ సమస్య పరిష్కారం కాక, పోలీసులు పట్టించుకోక ఇబ్బందులు పడుతున్న బాధితులు ఈఓడబ్ల్యూకు క్యూ కట్టారు. ఇలా గతేడాది జనవరి నుంచి డిసెంబర్ చివరి నాటికి 3,121 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూకబ్జాలు, చిట్‌ఫండ్ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో దూకుడుగా వ్యవహరించి పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను, కార్పొరేటర్ల భర్తలను, కొందరు మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు ఆఫీసర్లను అరెస్టు చేశారు. ఆ తర్వాత అడపాదడపా అరెస్టులు చేస్తున్నప్పటికీ మునుపటి దూకుడు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈఓడబ్ల్యూ మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి రావడంతో అక్రమార్కుల్లో టెన్షన్ మొదలవ్వగా.. బాధితుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.