- దాడి చేసి పట్టుకున్న ఆఫీసర్లు
- క్లినిక్‌లో సర్కార్ మందులు
జనగామ, వెలుగు : అర్హత లేకున్నా డాక్టర్‌గా చలామణి అవుతూ ట్రీట్‌మెంట్ చేయడమే కాకుండా, అల్లోపతి మందులను విక్రయిస్తున్న ఆర్‌ఎంపీని ఆఫీసర్లు పట్టుకున్నారు. చింతకింది యాదగిరి అనే వ్యక్తి ఎలాంటి అర్హత లేకుండానే జనగామ పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో శోభ క్లినిక్ నడుపుతున్నారు. ఈ విషయంపై ఆఫీసర్లకు సమచారం అందడంతో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజ్యలక్ష్మి, జనగామ, వరంగల్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు బాలకృష్ణ, అరవింద్‌కుమార్ గురువారం దాడి చేశారు.
అర్హత లేకున్నా మందులు అమ్మడం, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని బోర్డు పెట్టి లోపల ఐదు రూములు, మూడు బెడ్లతో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 43 రకాలకు చెందిన రూ. 45 వేల విలువైన అల్లోపతి మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సర్కార్ హాస్పిటల్‌లో రోగులకు ఫ్రీగా ఇచ్చే యాంటీ బయోటిక్ ట్యాబ్లెట్లు కూడా దొరికాయి. సర్కార్ మందులు ఈ క్లినిక్‌లోకి ఎలా వచ్చాయనే విషయంపై ఎంక్వైరీ చేస్తామని, ట్రీట్ మెంట్ చేస్తున్న యాదగిరిపై క్రిమినల కేసు నమోదు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. దాడుల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.