- ఎవుసం భూములకే రైతు భరోసా దక్కేలా పకడ్బందీ చర్యలు
- సర్వే కోసం ఐదారు శాఖల కో ఆర్డినేషన్
- అగ్రికల్చర్, పంచాయతీ రాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్
- సర్వే నంబర్ల వారీగా గుట్టలు, వెంచర్ల బ్లాక్ లిస్ట్ రెడీ చేయనున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతుభరోసా ఇస్తామని స్పష్టంచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపడ్తున్నది. అర్హులకే పెట్టుబడి సాయం అందించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది. వ్యవసాయ యోగ్యం కాని రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లకు రైతుభరోసా ఇచ్చేది లేదని ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీటికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వడంతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీన్ని కట్టడి చేసేందుకుగాను.. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా సాగుకు పనికి రాని భూముల (బీడు భూముల) లెక్క తీసేందుకు ఐదారు శాఖల సమన్వయంతో సర్వే చేపట్టనుంది. అగ్రికల్చర్, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌శాఖల అధికారులు ఫీల్డ్‌లోకి వెళ్లి వెరిఫికేషన్ చేయనున్నారు. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, పరిశ్రమల భూములు, రియల్ వెంచర్లు, నాలా, ప్రభుత్వం వివిధ అవసరాలకు సేకరించిన భూములు, నివాసాలు ఏర్పాటైన భూములను రైతు భరోసా లిస్ట్‌లో నుంచి తీసేయనున్నారు. కొంత భూమి సాగులో ఉండి.. మరికొంత సాగుకు యోగ్యం కాని భూమి ఉంటే.. పట్టాదారు ఖాతా నంబర్ కాకుండా ఎక్కడ సాగుకు అవకాశం లేదో ఆ సర్వే నంబర్‌ను గుర్తించి రైతు భరోసా లిస్ట్‌లో నుంచి తొలగించనున్నారు. ఇలా సాగుకు యోగ్యంగా లేని భూములకు సంబంధించిన సర్వే నంబర్లను రెడీ చేసి.. పెట్టుబడి సాయం అందకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాల నుంచి 15 లక్షల ఎకరాల వరకు వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
వివిధ శాఖల నుంచి డేటా సేకరణ
రాళ్లు, కొండలు, గుట్టలు, రియల్ వెంచర్లు, పరిశ్రమల భూములు, నాలా, ప్రభుత్వ వివిధ అవసరాలకు సేకరించిన భూముల వివరాలను ఆయా శాఖల నుంచి ప్రభుత్వం తీసుకోనుంది. వీటన్నింటిని వ్యవసాయ శాఖ క్రోడికరించి.. రైతు భరోసా అందకుండా బ్లాక్ లిస్ట్‌ను తయారు చేస్తుంది. నాలా (నాన్ అగ్రిల్చర్) భూముల వివరాలను మున్సిపల్ శాఖ నుంచి.. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూముల వివరాలను ఇరిగేషన్ శాఖ నుంచి.. రోడ్లు, హైవేల కోసం తీసుకున్న భూముల వివరాలను ఆర్ అండ్ బీ శాఖ నుంచి.. పరిశ్రమల కోసం తీసుకున్న భూముల వివరాలను టీజీఐఐసీ నుంచి .. మైనింగ్ భూముల వివరాలను మైనింగ్ శాఖ నుంచి.. ఇతర అవసరాలకు తీసుకున్న భూముల వివరాలను భూసేకరణ విభాగం (ల్యాండ్ ఆక్వేషన్ డిపార్ట్మెంట్) నుంచి అధికారులు తీసుకుంటారు.
Also Read :- జవహర్ నగర్ డంపింగ్ యార్డు పై హెవీ లోడ్
వాటి సర్వే నంబర్లన్నింటినీ క్రోడికరించి లిస్ట్ తయారు చేస్తారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతుభరోసా అందకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడ్తారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వెరిఫికేషన్ చేపడ్తారు. అయితే సీసీఎల్‌ఏలోనే ఆయా సర్వే నంబర్లను బ్లాక్ చేయడమా లేక ఎప్పటిలాగే రెవెన్యూ శాఖ నుంచి పట్టాదారులు, విస్తీర్ణం ఇతర వివరాలను వ్యవసాయ శాఖ తీసుకున్న తర్వాత ఫిల్టర్ చేయడమా అనేదానిపై అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
వానాకాలం సాగు లెక్కలు ప్రామాణికంగా..!
రాష్ట్రలో వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు ఒక కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు ఆ శాఖ రిపోర్టుఇచ్చింది. ఈ లెక్కలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం.. అవసరమైన నిధులను సిద్ధం చేసుకుంటుంది. ఇంకా మిగిలిన సాగుకు యోగ్యమైన భూమి ఉంటే ఆ మొత్తం ఇంకో 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు మించి ఉండే అవకాశం లేదని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
అందులో భాగంగానే దాదాపు 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నది. సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇస్తే మొత్తం రూ.8,400 కోట్లు అవుతాయి. గతంతో చూస్తే ఇది వెయ్యి కోట్ల రూపాయలు అదనం. ఒకవేళ సాగుకు యోగ్యం కాని భూమి ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే.. ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా పెట్టుబడి సాయం కొంత తగ్గే చాన్స్ఉంది. సీసీఏల్ఏ డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 54 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నది.