సగం కూడా కొనలే .. జనగామ జిల్లాలో అంతంతమాత్రంగా వడ్ల కొనుగోళ్లు

  • టార్గెట్‌‌‌‌‌‌‌‌ 2.30 లక్షల టన్నులు.. కొన్నది 67,529 టన్నులే..
  • వాతావరణ మార్పులు, ధర కారణంగా సెంటర్లకు రాని రైతులు
  • చివరి దశకు చేరిన కొనుగోళ్లు

జనగామ, వెలుగు : వానాకాలం వడ్ల కొనుగోళ్లలో ఆఫీసర్లు అనుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకోలేకపోయారు. వరికోతలు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అయినప్పటి నుంచి వాతావరణంలో మార్పులతో మాయిశ్చర్‌‌‌‌‌‌‌‌ సమస్యలు ఏర్పడ్డాయి. మరో వైపు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులు సైతం మంచి ధర ఇవ్వడంతో రైతులు సర్కార్‌‌‌‌‌‌‌‌ కేంద్రాలకు రాకుండా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వైపే మొగ్గు చూపారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ కారణంగా ఆఫీసర్లు సైతం కొనుగోళ్లపై పెద్దగా ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో అనుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌లో సగం కూడా కొనలేకపోయారు. ఇప్పటికే కొన్ని సెంటర్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌ కాగా, మిగిలిన కేంద్రాలను కూడా త్వరలోనే మూసివేయనున్నారు. వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవడంతో మరో ఏడెనిమిది వేల టన్నులకు మించి కొనే పరిస్థితి లేకుండా పోయింది.

2.30 లక్షల టన్నులకు 67,529 టన్నులే కొన్నరు

జనగామ జిల్లా మొత్తంలో 172 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 81 ఐకేపీ, 91 పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 44 సెంటర్లను ఎత్తివేయగా ప్రస్తుతం 23 ఐకేపీ, 21 పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో మరిన్ని సెంటర్లు ఎత్తేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 2.30 లక్షల టన్నుల వడ్లు కొనాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నారు. కానీ వాతావరణ మార్పులతో రైతులు సర్కార్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురాలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 12,865 మంది రైతుల వద్ద 67,529 టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. వీటికి సంబంధించి రూ. 135 కోట్లు చెల్లించాల్సి ఉండగా, 9,478 మంది రైతులకు రూ.106.45 కోట్లు చెల్లించారు. మరో 3,387 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. 

రైతులు వడ్లు తేలేదు 

వాతావరణం అనుకూలించక పోవడంతో రైతులు సెంటర్లకు వడ్లు ఎక్కువగా తేలేదు. దీంతో టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకోలేకపోయాం. వడ్లు అమ్మి రైతులకు సకాలం చెల్లింపులు చేస్తున్నాం. వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం. సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

రోజారాణి, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్‌‌‌‌‌‌‌‌