హరితహారం చెట్లు నరికేస్తున్న అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో హరితహారం కూడా ఒకటి. అందులో భాగంగా ఏపుగా పెరిగిన చెట్లను చూసి, ప్రకృతిని ఆస్వాదించేలోపే అధికారులు ఆ చెట్లను నరికేస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అప్పట్లో జగిత్యాల – వెల్గటూర్ రోడ్డుకి ఇరువైపులా అధికారులు  మొక్కలు నాటారు. ఈ మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా హరితవనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రయాణికులను కనివిందు చేస్తున్నాయి. అయితే ఆ పచ్చదనాన్ని ప్రయాణికులు ఆస్వాదించేలోపే విద్యుత్ అధికారులు వాటిని నరికి వేస్తున్నారు. గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామ శివారులో  విద్యుత్ తీగలకు చెట్లు అడ్డొస్తుండటంతో వాటిని నరికేస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు అధికారులపై మండిపడుతున్నారు.