హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామం గుడాటిపల్లిని ఆఫీసర్లు నేలమట్టం చేశారు. బుధవారం సాయంత్రం సుమారు 50 వాహనాల్లో పోలీసులతో కలిసి వచ్చిన ఆఫీసర్లు ఎక్స్కవేటర్లతో ఒక్కో ఇంటిని కూల్చుకుంటూ వెళ్లారు. ప్రాజెక్టు చుట్టూ మోహరించిన పోలీసు బలగాలు జర్నలిస్టులతో పాటు ఎవరినీ ఆ గ్రామంవైపు రాకుండా పహారా కాశాయి. ప్రభుత్వం తమకు న్యాయమైన పరిహారం ఇవ్వడంలేదని 14మంది రైతులతోపాటు వివిధ రకాల పరిహారాలు రానివారు దాదాపు 50 కుటుంబాల ప్రజలు ఇప్పటికీ గ్రామంలోనే ఉంటున్నారు. .
వారంతా కోర్టును ఆశ్రయించి పరిహారం కోసం కొట్లాడుతున్నారు. మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్టు పనులు ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామాలతో చివరి దశలో ఉన్న ప్రాజెక్టు పనులు ఎక్కడ ఆగిపోతాయోనని ప్రభుత్వం బలప్రయోగం చేస్తోందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. పరిహారం తీసుకోని వారికి ఎకరానికి రూ.6.90లక్షల చొప్పున ప్రభుత్వం కోర్టులో డిపాజిట్ చేసిందని, ఈ నేపథ్యంలోనే ఇండ్లు ఖాళీ చేయాలని మంగళవారం నోటీసులు ఇచ్చి, బుధవారం ఇండ్లను కూల్చివేశారని చెప్తున్నారు.
కాగా, ఇండ్లకు తాళం వేసుకొని వెళ్లిన నిర్వాసితుల సామాన్లను పోలీసులు.. హుస్నాబాద్‌లోని డబుల్బెడ్రూమ్ ఇండ్లకు తరలించారు. అందుబాటులో ఉన్నవాళ్లకు బలవంతంగా సామాన్లను అప్పగించారు.