పట్టా పాస్​బుక్​ కోసం వృద్ధ దంపతుల ఆందోళన

 తల్లాడ, వెలుగు: తమ ఎకరం భూమి పాస్ బుక్ ఇవ్వాలని తల్లాడకు చెందిన వృద్ధ దంపతులు మొక్కా సీతారాములు, అప్పమ్మ దంపతులు వారి కూతురు ఆదిలక్ష్మితో కలిసి సోమవారం తహసీల్​ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. సర్వే నంబర్ 70లో భూమి తీసుకున్నామని, ఇప్పటికీ తమకు పాస్ బుక్​ఇవ్వలేదన్నారు. కలెక్టర్, తహసీల్​ఆఫీసుల చుట్టూ తిరిగినా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ లీడర్​డాక్టర్ మట్టా దయానంద్ వారికి సంఘీభావం తెలిపారు. 

దీనిపై తహసీల్దార్ గంటా శ్రీలతను వివరణ కోరగా సదరు భూమి గురజాల రఘురామారావు వద్ద కొనుగోలు చేశారని, అమ్మినవారు ఇద్దరు అన్నదమ్ములు కావడంతో వారసత్వ పంపకాల్లో ఆ భూమి మాధవరావుకి వెళ్లడంతో మాధవరావు తన కోడలు కంది రేఖ పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడన్నారు. కందిరేఖ మొక్క సీతారాముల పేరున రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని తహసీల్దార్​చెప్పారు.