వరంగల్ సెంట్రల్ జైలును ఖాళీ చేస్తున్న అధికారులు 

వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను రాష్ట్రంలోని వివిధ జైళ్లకు తరలించనున్నారు. అందుకోసంగానూ బస్సులతో ఎస్కార్ట్ సిబ్బంది జైలుకు చేరుకున్నారు. జైలులో ప్రస్తుతం 960 మంది ఖైదీలు ఉన్నారు.  జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది ఖైదీల తరలింపును పరిశీలించనున్నారు. మరోవైపు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర జైళ్లకు ఖైదీల తరలింపుపై విమర్శలు వస్తున్నాయి. 

1886లో 67 ఎకరాల్లో వరంగల్ సెంట్రల్ జైలును నిర్మించారు. అయితే ఈ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఇటీవల జైలును పరిశీలించారు. జైలును ఖాళీ చేయాలని అధికారులకు సూచనలు చేశారు. దాంతో అధికారులు ఖైదీలను.. దగ్గర్లో ఉన్న మిగతా జైళ్లకు తరలిస్తున్నారు. ఖైదీల తరలింపు తర్వాత వైద్యశాఖ అధికారులు జైలును స్వాధీనం చేసుకోనున్నారు. 

కాగా.. కొత్త సెంట్రల్ జైలు నిర్మాణానికి 130 ఎకరాలు కావాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అధికారుల సూచనమేరకు మామునూరులో 120 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.