
ములుగు, వెలుగు : ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులు ధనసరి సమ్మక్క, సమ్మయ్య దంపతులకు గురువారం ఆఫీసర్లు పోడు భూముల హక్కు పత్రాలు అందించారు. ములుగు మండలంలోని సీతక్క సొంతూరు జగ్గన్నపేటలో జరిగిన పోడుపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రాంనాయక్ చేతుల మీదుగా పోడు పట్టాను తీసుకున్నారు.
ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో జగ్గన్నపేట శివారులో ధనసరి సమ్మయ్య పేరుమీద ఎకరం 17గుంటల పోడు భూమి ఉన్నట్లు నిర్ధారించారు. జాబితా ప్రకారం హక్కు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీడీవో ఇక్బాల్, సర్పంచ్ నూనేటి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, తమకు అధికార, ప్రతిపక్షం అనే తేడా లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు జారీ చేయడమే తమ పారదర్శకతకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.