- పట్టింపులేని ఉన్నతాధికారులు
- పర్యవేక్షణ లేక బృందాల ఇష్టారాజ్యం
జనగామ, వెలుగు: వైద్యారోగ్య శాఖ అధికారుల తనిఖీలన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయి. ప్రైవేటు హాస్పిటల్స్, ఆర్ఎంపీ ఫస్ట్ ఎయిడ్ క్లీనిక్‌ల వైద్య సేవల్లోని అక్రమాలను వెలికితీయాలనే లక్ష్యంతో జనగామ జిల్లాలో వారం రోజులుగా ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు అంతా తూతూ మంత్రంగానే సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆఫీసర్లు వారు ఉన్న చోటుకే ఆర్ఎంపీలను పిలిపించుకుని తనికీ చేసినట్లు రాసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో తనిఖీల బృందాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఓవైపు జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ట్రీట్ మెంట్ పేరిట పేషెంట్లను ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఎక్కువే. ఇక ఆర్ఎంపీలు మరింత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ క్లీనిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆర్ఎంపీల దందాపై ఆఫీసర్లు నజర్ పెట్టి తనిఖీలకు దిగారు.
వారం రోజులుగా తనిఖీలు..
జిల్లాలో సుమారు 46 హాస్పిటల్స్, 54 క్లీనిక్‌లు, ఆరు ల్యాబ్‌లు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమతి లేనివి కూడా మరికొన్ని ఉన్నాయి. వీటిలోని అవకతవకలను బయటపెట్టేందుకు డీఎంహెచ్ వో హరీశ్‌రాజ్ 5 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రోగ్రాం ఆఫీసర్లు మహేందర్, రవీందర్ గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీదేవి, సుధీర్, సివిల్ సర్జన్ పీఎస్ మల్లికార్జున్ సారథ్యం వహిస్తున్నారు. ఒక్కో బృందంలో 8 మంది స్టాఫ్ ఉన్నారు. సుమారు 15 రోజుల్లో తనిఖీలు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సగం తనిఖీలు పూర్తైనట్లు అధికారులు తెలిపారు.
తూతూ మంత్రంగానే..
తనిఖీ బృందాలు హాస్పిటల్స్ కు నేరుగా వెళ్లి తనిఖీలు చేస్తున్నాయి. ప్రధానంగా రెన్యువల్, వేస్ట్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం తదితర మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. చెక్ లిస్ట్ తీసుకెళ్లి నివేదిక తయారు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఊరికి కనీసం ఇద్దరు ముగ్గురు ఆర్ఎంపీలు ఉన్న నేపథ్యంలో వారు అనధికారికంగా నడుపుతున్న క్లీనిక్‌ల పై బృందాలు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కానీ, ఓ బృందంలోని డాక్టర్ జనగామలోని తన హాస్పిటల్‌కు ఆయన పనిచేసే మండలానికి చెందిన ఆర్ఎంపీలను పిలిపించుకుని తనిఖీలు చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందించడం విమర్శలకు దారితీస్తోంది. సదరు ఆర్ఎంపీల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. దీంతో తనిఖీల్లోని డొల్లతనం బయటపడుతోంది. ఇప్పటికైనా తనిఖీలను సరైన పద్ధతిలో నిర్వహించాలని, ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని వైద్య వర్గాలు, ప్రజలు కోరుతున్నారు.