గణేశ్​ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. డీజేలకు పర్మిషన్​ లేదన్న పోలీసులు

  •     నగరంలో 24 చెరువులు సిద్ధం 
  •     సిటీలో నేటి మధ్యాహ్నం నుంచి రేపటి వరకు ట్రాఫిక్​ ఆంక్షలు
  •     డీజేలకు పర్మిషన్​ లేదన్న పోలీసులు

హనుమకొండ, వెలుగు: తొమ్మిది రోజులు సందడిగా సాగిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. దీంతో గ్రేటర్​ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఆఫీసర్లు  ఏర్పాట్లు పూర్తి చేశారు.  చెరువుల్లో గుర్రపు డెక్క, చెత్తాచెదారం తొలగింపు పనులు చేపట్టారు. నగరం మొత్తం మీద 24 చెరువులను నిమజ్జనానికి ఎంపిక చేశారు. ఆయా చెరువుల వద్ద క్రేన్లను అందుబాటులో ఉంచారు. 

హైదరాబాద్​ తరహాలో రెండు భారీ క్రేన్లను కూడా తీసుకొచ్చారు. గ్రేటర్​, ఇరిగేషన్​, ఎలక్ట్రికల్​, ఫైర్​ తదితర డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో శానిటేషన్,  హై మాస్ట్ లైటింగ్, మంచినీటి సౌకర్యం, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​ ఆంక్షలు విధిస్తూ పోలీసులు పటిష్ట బందోబస్తుకు చర్యలు చేపట్టారు. కాగా నిమజ్జన శోభాయాత్రకు డీజేలకు పర్మిషన్​ లేదని, రూల్స్​ బ్రేక్​ చేస్తే సీరియస్​ యాక్షన్​ ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

24 చెరువుల్లో నిమజ్జనం

గ్రేటర్​ వరంగల్ పరిధిలో చిన్నవి, పెద్దవి అన్నీ కలిసి దాదాపు 7వేలకు పైగా విగ్రహాలు ఏర్పాటు చేయగా..  నగర పరిధిలో మొత్తం 24 చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ వరంగల్​ జిల్లా పరిధిలో చిన్న వడ్డేపల్లి చెరువు, కోటి చెరువు, ఉర్సు చెరువు, బెస్తం చెరువు, గుండు చెరువు, కట్టమల్లన్న చెరువు, అగర్తలా చెరువు. 

సింగారం చెరువు, మామునూర్ చెరువు. తిమ్మాపూర్ చెరువులున్నాయి.  హనుమకొండ పరిధిలోని బంధం చెరువు, సిద్దేశ్వర గుండం, గోపాలపూర్​ చెరువు, భీమారం, వంగపహాడ్, ఎల్లపూర్, పెగడపల్లి, కడిపికొండ, రాంపేట,  రాంపూర్, సోమిడి, హసన్​ పర్తి, మడికొండ, గుండ్ల సింగారం చెరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. రెండు నెలల కిందట కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లు దెబ్బతినగా.. కొన్నిచోట్ల టెంపరరీ రిపేర్లు చేశారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్​ ఆంక్షలు

గణనాథుడి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీలో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటలకు సిటీలో ట్రాఫిక్​ మళ్లింపు, ఇతర ఆంక్షలు కొనసాగుతాయని సీపీ ఏవీ.రంగనాథ్​ మంగళవారం తెలిపారు.   నిమజ్జనం ముగిసేవరకు   సిటీ లోపలికి భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.  వాహనదారులు, గణేశ్​ నవరాత్రి మండప నిర్వాహకులు పోలీసుల సూచనలను పాటిస్తూ శోభాయాత్ర ను విజయవంతం చేసుకోవాలని సీపీ ఏవీ. రంగనాథ్​ సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపు

ములుగు, భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్​ వెళ్లే  భారీ వాహనాలు  ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.  భూపాలపల్లి, పరకాల నుంచి ఖమ్మం వైపు వెళ్లే వెహికిల్స్​ ఆరెపల్లి  ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కరుణాపురం, మడికొండ, కడిపికొండ మీదుగా నాయుడు పెట్రోల్ పంపు నుంచి వెళ్లాలి. భూపాలపల్లి, పరకాల వైపు నుంచి నర్సంపేట వైపు వెళ్లాల్సిన వెహికిల్స్​ కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్​ పీరీలు, గొర్రెకుంట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.  ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు పెద్దమ్మగడ్డ మీదుగా  కేయూసీ, సీపీవో జంక్షన్​, అంబేద్కర్​ సెంటర్​,  ఏషియన్  శ్రీదేవి మాల్ నుంచి బస్టాండ్​కు చేరుకోవాలి. బస్టాండ్​ నుంచి ములుగు, కరీంనగర్​ వైపు వెళ్లే బస్సులు ఇదే మార్గంలో తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 

హనుమకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్లాలి. వరంగల్ బస్టాండ్ నుంచి హనుమకొండ వైపు రావాల్సిన బస్సులు చింతల్ బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్ పంపు సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హనుమకొండకు చేరుకోవాలి.

నిమజ్జన వెహికిల్స్​ ఇలా..

సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం చేసిన తరువాత వాహనాలు శాయంపేట వైపు వెళ్లే రోడ్డు మీదుగా వెళ్లాలి. ఆరు అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలకు కూడిన బండ్లు సిద్దేశ్వర గుండంలో నిమజ్జనానికి అనుమతి లేదు. అలాంటి విగ్రహాలను  కోట చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువులకు తీసుకెళ్లాలి. శాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాలు హంటర్ రోడ్, అదాలత్, హనుమకొండ చౌరస్తా మీదుగా వెళ్లాలి.  

కోట చెరువు వైపు వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ, ములుగు జంక్షన్, ఎంజీఎం ఆటోనగర్ మీదుగా కోటచెరువుకు వెళ్లాలి. ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయాలి. చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్ నుంచి నర్సంపేట రోడ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. కోట చెరువులో వినాయక విగ్రహ నిమజ్జన అనంతరం వాహనాలు  హనుమాన్ జంక్షన్ , పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్ మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.