- నిరుడు ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ 34 శాతమే కంప్లీట్
- 72 రైసుమిల్లులకు నోటిసులు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ మిల్లింగ్ స్లోగా సాగుతోంది. సెప్టెంబర్ 30 వరకు పూర్తిగా మిల్లర్లు బియ్యం అప్పజేయాల్సి ఉంది. గడువు దగ్గరికొస్తున్న ఇప్పటి వరకు 34 శాతమే అందించారు. మిల్లింగ్ ఆలస్యంగా చేస్తున్న 72 రైసుమిల్లులకు ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు.
కలెక్టర్ సీరియస్
సీఎంఆర్ అంశాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆఫీసర్లు, మిల్లర్లతో మీటింగ్‌లు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా బియ్యం అప్పజెప్పాలని లేనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 2023 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకు అప్పగించారు. ఇచ్చిన వడ్లకు ప్రభుత్వానికి సీఎంఆర్ కింద మిల్లర్లు 2,98,927 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు మిల్లర్లు 1,02,027 మెట్రిక్ టన్నుల బియ్యం ( 34 శాతం) అప్పగించారు. ఇంకా 66 శాతం బియ్యం మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సి ఉంది.
200 వరకు మిల్లులకు ఆయా సీజన్లలో వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు కేటాయిస్తోంది. మిల్లర్లు, సివిల్ సప్లయ్ ఆఫీసర్లతో ఇటీవల కలెక్టర్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో మిల్లర్లను తనిఖీ చేసి కేటాయించిన వడ్ల నిల్వ, సీఎంఆర్ మిల్లింగ్ ను పరిశీలించాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ టీమ్స్ భిక్కనూరు, సదాశివనగర్, పాల్వంచ మండలాల్లోని మిల్లుల్లో తనిఖీలు చేపట్టాయి. మంగళవారం కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ సీఎంఆర్‌పై సివిల్ సప్లయ్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. కొన్ని మిల్లులు సీఎంఆర్ ఇవ్వటంపై నిర్లక్ష్యం వ్యవహిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఆఫీసర్లు సీరియస్‌గా తీసుకోవటంతో సీఎంఆర్ అప్పగించారు. ఉన్నతాధికారులు ప్రతి రోజు మిల్లులను తనిఖీ చేయటంతో మిల్లర్లు అలర్టు అయి బియ్యాన్ని అప్పగించారు.
చర్యలు తీసుకుంటాం
సీఎంఆర్ బియ్యంను నిర్ధేశించిన ప్రకారం అప్పగించాలని మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చాం. 72 మిల్లులకు నోటీసులు ఇచ్చాం. సెప్టెంబర్ 30లోగా టార్గెట్ 100 శాతం రీచ్ కావాలి. కాకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
నిత్యానందం, జిల్లా ఇన్చార్జీ డీఎస్వో