నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 9 సింగిల్ విండోలు

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 9 సింగిల్ విండోలు
  •  పెద్ద సంఘాలను విభజించాలని సర్కారుకు ప్రతిపాదనలు 
  • మరిన్ని పెంచాలని విండో పాలకుల కిరికిరి

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కొత్త సింగిల్​ విండోల ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది.  గత బీఆర్​ఎస్​ సర్కారు ప్రతిపాదనలు తీసుకొని పెండింగ్‌‌లో  పెట్టిన  పీఏసీఎస్​ల విభజన పై వివరాలు పంపాలని ఆఫీసర్లను కాంగ్రెస్​ గవర్నమెంట్​ కోరింది. ఇప్పుడున్న 89 సంఘాల్లో  ఎక్కువ గ్రామాలున్న సంఘాలను విభజించి కొత్తగా తొమ్మిది సంఘాలను ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు రిపోర్టు పంపారు.ఆదాయం పొందగలిగే అవకాశం ఉన్న గ్రామాల్లో కొత్త విండోలను ప్రతిపాదించారు.  కాగా అన్ని మండలాలల్లో కొత్త పీఏసీఎస్​ల అవసరముందని పాలకవర్గాలు తీర్మానాలు చేయడంతో కొత్త వివాదం మొదలైంది.  

అధికారుల ప్రామాణిక అంశాలివి

రైతులకు సేవలు అందించడానికి సింగిల్​ విండో వ్యవస్థ ఏర్పడింది.   ప్రభుత్వం నుంచి వీటి నిర్వహణ కోసం ఎలాంటి ఫండ్స్ అందవు. ఏటా డీసీసీబీ బ్యాంకు నుంచి అన్నదాతలకు  క్రాప్​ లోన్లు ఇప్పించడమే కాకుండా పంట విత్తనాలు, యూరియా అమ్మకాలతో సొంతంగా బిజినెస్​ చేసి ఇన్​కం​ జనరేట్​ చేసుకొని సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు భరించాలి.  వడ్ల కొనుగోలు సెంటర్ల నిర్వహణ ఇప్పుడు విండోల ప్రధాన ఆదాయంగా మారింది. 

జిల్లాలో 30 వరకు సంఘాలు లాభాల్లో  కొనసాగుతుండగా మిగితా వాటి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఒక విండో పరిధిలో ఐదు వేల ఎకరాల పంట భూమి, గరిష్టంగా 10 కిలో మీటర్ల పరిధిలో  రైతులు సర్వీస్​ పొందేలా కొత్త వాటిని గుర్తించారు. జిల్లాలో  జన్నేపల్లి, పెగడపల్లి ​, లక్ష్మాపూర్​, తగిలేపల్లి, సిద్దాపూర్, జలాల్​పూర్,  దేగాం, తిమ్మాపూర్​, వన్నెల్​(బి) లో కొత్త సింగిల్​ విండోలను సర్వీస్​ బౌండరీలతో ప్రతిపాదించారు.  

విండోల ప్రయారిటీ పెరిగిందంటున్న పాలకవర్గాలు

జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 545కు చేరగా 15 ఏండ్ల నుంచి సింగిల్​ విండోల సంఖ్య 89 మాత్రమే ఉంది.  మాక్లూర్​ విండో పరిధిలో 23 పంచాయతీలుండగా నవీపేట మండలం బినోలలో 18 విలేజ్​లు, సిరికొండలో 16, బాల్కొండలో 12 ఇలా ఎక్కువ పరిధితో గల సహకార సంఘాలు 26  దాకా ఉన్నాయి.  విండో పరిధిలో ఎక్కువ గ్రామాలున్న చోట రైతులు కోరుకుంటున్న సేవలు అందించలేకపోతున్నారు.  

జిల్లాలో 2.99 లక్షల మంది పేర్లతో వ్యవసాయ భూములుండగా సింగిల్​ విండో సభ్యత్వాలున్న  అన్నదాతల సంఖ్య లక్ష మాత్రమే ఉన్న సంగతిని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. విభజనతో కొత్త సంఘాలు ఏర్పడితే మెంబర్​షిప్​ పెరిగి పీఏసీఎస్​లు మరింత బలపడతాయని పేర్కొంటూ వెల్మల్​, పెద్ద వాల్గోట్​, న్యావనంది, చీమన్​పల్లి, మంచిప్ప, మల్లారం, ఇందల్వాయి, ఎల్లారెడ్డి పల్లి సొసైటీల ఏర్పాటుకు పాలకవర్గాలు తీర్మానం చేసి ఈనెలలో డీసీవో శ్రీనివాస్​కు  అందించారు. 

మనుగడ ముఖ్యం

అన్ని కోణాలలో ఆలోచించి కొత్త సంఘాల ఏర్పాటుకు గవర్నమెంట్​కు నివేదిక పంపినం.  విండో పాలకుల నుంచి వస్తున్న తీర్మానాలు పరిశీలిస్తున్నాం. ఇప్పటికే చాలా సంఘాలు ఆర్థిక కష్టాలలో ఉన్నాయి.  సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దీనస్థితిలో ఉన్న సంఘాలను విడదీస్తే ఎలాంటి  ఉపయోగం ఉండదు.

డీసీవో శ్రీనివాస్​