గోపాలపూర్‌‌ చెరువు ఆక్రమణలు తొలగింపు

  • రాత్రికి రాత్రే గుడిసెలు, కాంపౌండ్లు కూలగొట్టిన ఆఫీసర్లు
  • పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపం చూపుతున్నారంటూ స్థానికుల ఆగ్రహం
  • అర్ధరాత్రి చెరువు వద్ద టెన్షన్‌‌, సీపీఎం నేతల అరెస్ట్‌‌
  • కూల్చివేతలను నిరసిస్తూ హనుమకొండ కలెక్టరేట్‌‌ వద్ద ఆందోళన

హనుమకొండ, వెలుగు : గ్రేటర్‌‌ వరంగల్‌‌ పరిధిలోని చెరువుల ఆక్రమణలపై ఆఫీసర్ల చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నగర నడిబొడ్డున ఉన్న గోపాలపూర్‌‌ చెరువు ఆక్రమణలను బుధవారం అర్ధరాత్రి తొలగించారు. సుమారు 20 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉండాల్సిన గోపాలపూర్‌‌ ఊర చెరువు సగం వరకు ఆక్రమణకు గురైంది. 

ఈ స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగ్‌‌లతో పాటు, సబ్‌‌స్టేషన్‌‌, ఇతర నిర్మాణాలు వెలియడంతో చెరువు పూర్తిగా కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. మరో వైపు గోపాలపూర్‌‌ చెరువు భూములను కబ్జా చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని, రియల్టర్ల చేతిలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు కేటాయించాలని డిమాండ్‌‌ చేస్తూ కొంతమంది చెరువు స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. కబ్జాలను సీరియస్‌‌గా తీసుకున్న ఆఫీసర్లు చర్యలకు ఉపక్రమించారు.

అర్ధరాత్రి హైటెన్షన్‌‌

గోపాలపూర్‌‌  ఊర చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడం, కబ్జాలు ఆగకపోవడంతో ఇరిగేషన్‌‌ ఆఫీసర్లకు చాలా ఫిర్యాదులు అందాయి. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్‌‌ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. వరంగల్‌‌ సిటీలోని ఇంతేజార్‌‌ గంజ్‌‌, సుబేదారి, హనుమకొండ, కేయూ పోలీస్‌‌ స్టేషన్ల సిబ్బందితో పాటు మున్సిపల్‌‌ డీఆర్‌‌ఎఫ్‌‌, ఇతర అధికారులు సుమారు 100 మంది  ప్రొక్లెయినర్లతో బుధవారం రాత్రి చెరువు వద్దకు చేరుకున్నారు. 

అప్పటికే సమాచారం అందుకున్న సీపీఎం లీడర్లు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆఫీసర్లు గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నిస్తుండడంతో లీడర్లు, గుడిసెవాసులు కలిసి ఆఫీసర్లను అడ్డుకున్నారు. రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. 58 జీవో ప్రకారం అప్లై చేసుకున్నామని, గుడిసెలు తొలగించొద్దని కోరారు. 

దీంతో ఉన్నతాధికారులతో ఫోన్‌‌లో మాట్లాడిన సుబేదారి సీఐ షుకూర్‌‌ సీపీఎం లీడర్లను అరెస్ట్‌‌ చేసేందుకు ప్రయత్నించడంతో చెరువు వద్ద టెన్షన్‌‌ నెలకొంది. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.ఉప్పలయ్య, మరికొందరు గుడిసెవాసులను పోలీసులు అరెస్ట్‌‌ చేసి స్టేషన్‌‌కు తరలించారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చిపడేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దోళ్లను వదిలేసి.. పేదలపై ప్రతాపమా ?

గోపాలపూర్‌‌ చెరువు చుట్టూ భూములు ఆక్రమణకు గురికాగా అందులో చాలా వరకు బిల్డింగులే ఉన్నాయి. కొందరు వ్యక్తులు చెరువు మధ్య వరకు కాంపౌండ్లు కట్టగా.. మరికొందరు ఇండ్లు కట్టి అమ్మేశారు. ఇలా ఆక్రమణకు పాల్పడిన వారిలో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు సైతం ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం పేదల గుడిసెలను  కూల్చడంతో ఆఫీసర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గుడిసెల కూల్చివేత దుర్మార్గం

గోపాలపూర్‌‌ ఊర చెరువు శిఖం భూమిలో రెండేండ్ల నుంచి ఉంటున్న పేదల గుడిసెలను తొలగించడం దుర్మార్గం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌‌  రావు అన్నారు. గుడిసెల కూల్చివేతను నిరసిస్తూ గురువారం ఉదయం ఆర్ట్స్​కాలేజీ ఆడిటోరియం నుంచి హనుమకొండ కలెక్టరేట్‌‌ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌‌ ఎదుట బైఠాయించారు. 

ఈ సందర్భంగా సుదర్శన్‌‌రావు మాట్లాడుతూ గత పదేండ్లలో బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారన్నారు. ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌‌ను నమ్మి గెలిపిస్తే నెల తిరగకుండానే  గుడిసెవాసులపై ప్రతాపం చూపుతోందని విమర్శించారు. గోపాలపూర్‌‌ చెరువుకు సంబంధించిన 12 ఎకరాలను రియల్‌‌ వ్యాపారాలు, రాజకీయ నాయకులు అమ్ముకుంటే పట్టించుకోని ఆఫీసర్లు ఇప్పుడు పేదలపై ప్రతాపం చూపడమేంటని ప్రశ్నించారు.

 అనంతరం కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కలెక్టర్‌‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.చుక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్, జి.రాములు, డి.తిరుపతి, మంద సంపత్ పాల్గొన్నారు.