ఆపరేషన్‌‌‌‌ చిరుత .. కర్నాటక నుంచి నారాయణపేటకు వలస వస్తున్నయ్

ఆపరేషన్‌‌‌‌ చిరుత .. కర్నాటక నుంచి నారాయణపేటకు వలస వస్తున్నయ్
  • కోస్గి, దామరగిద్ద ప్రాంతాల్లోని రాతి గుట్టల్లో ఆవాసాలు
  • వివిధ కారణాలతో 8 నెలల్లోనే 4 చిరుతలు మృతి
  • చిరుతలను పట్టుకొని నల్లమలకు తరలించేందుకు ప్రయత్నాలు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : నారాయణపేట జిల్లాలో వరుసగా చిరుత పులులు చనిపోతుండడం కలకలం రేపుతోంది. కర్నాటక అడవుల నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన చిరుతలు నారాయణపేట రాతిగుట్టల ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇక్కడికి వచ్చిన చిరుతల్లో వివిధ కారణాలతో ఇప్పటికే నాలుగు చనిపోయాయి. దీంతో మిగతా వాటిని రక్షించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. చిరుతల సంచారం తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు బిగించడంతో పాటు వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు చిరుతలను పట్టుకున్న ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు వాటిని నల్లమల అడవికి తరలించారు. 

కర్నాటకలోని మినాస్‌‌‌‌పూర్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ నుంచి...

కర్నాటక రాష్ట్రం యాద్గిర్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ డివిజన్‌‌‌‌ పరిధిలో 28,868.55 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ఈ డివిజన్‌‌‌‌లో హోరంచ, ఎర్గోల, అష్‌‌‌‌నాల్‌‌‌‌, మినాస్‌‌‌‌పూర్‌‌‌‌ బ్లాక్‌‌‌‌లు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతం జింకలు, ఎలుగుబంట్లు, చిరుతలు, పెద్దపులులకు ఆవాసం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చిరుతల సంతతి పెరుగుతోంది. దీంతో ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతానికి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపేట జిల్లాలోకి అడుగు పెడుతున్నాయి. 

ఇక్కడి కోస్గి, మద్దూరు, ధన్వాడ, గుండుమాల్, కొత్తపల్లి, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లోని నందిపహాడ్, పల్లెర్ల, చెన్నారెడ్డిపల్లి, దుప్పటిగట్టు, మోమినాపూర్, బలభద్రాయపల్లి, ఉడ్మల్‌‌‌‌గిద్ద, గుండుమాల్, నిడ్జింత, కిష్టాపూర్, లక్ష్మీపూర్, అయ్యవారిపల్లి శివార్లలో ఉన్న రాతి గుట్టలను ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆయా మండలాల్లో 15 పైగానే చిరుత పులులు ఉన్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ఏడాదిలోపు వయస్సు ఉన్న చిరుతలు ఆరు వరకు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.

ఎనిమిది నెలల్లో నాలుగు చిరుతలు మృతి

నారాయణపేట జిల్లాలో గతేడాది మే నుంచి ఇప్పటివరకు నాలుగు చిరుత పులులు చనిపోయాయి. గతేడాది మే 4న మద్దూరు మండలం నందిగామ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కిజాదరావుపల్లి శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత పులి చనిపోయింది. నాలుగు రోజుల తర్వాత ఓ రైతు గమనించి ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లకు చెప్పాడు. ఈ చిరుత మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అదే ఏడాది ఆగస్టు 17న మద్దూరు మండలం జాదవరావుపల్లి శివారులోని తాటిగట్టు సమీపంలోని రాయం చెరువు వద్ద మరో చిరుత చనిపోయింది. ముళ్ల పంది దాడిలో చిరుత చనిపోయి ఉంటుందని ఆఫీసర్లు భావించారు. 

గత నెల 28న దామరగిద్ద మండలం ఉడ్మల్‌‌‌‌గిద్ద శివారులోని గుట్టల్లో ఓ చిరుత చనిపోయింది. ఈ చిరుత ఒక రోజు ముందు గ్రామంలో ఓ దూడపై దాడి చేసి చంపింది. దాని కళేబరాన్ని గుట్టపైన గుహలోకి తీసుకొచ్చి సగం వరకు తినేసింది. అయితే నీళ్లు తాగేందుకు గుట్ట దిగుతూ రెండు రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయినట్లు ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నెల 16న మద్దూరు మండలం మోమినాపూర్​ గ్రామ శివారులో ఓ చిరుత చనిపోయింది. దీని మెడపై మరో చిరుత దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. ఆ దాడితోనే చిరుత చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నల్లమల ఫారెస్ట్‌‌‌‌లోకి తరలించే ప్లాన్‌‌‌‌

గ్రామాల పరిసరాల ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చిరుతలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఇటు ప్రజలు, అటు చిరుతల సంరక్షణకు ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిరుతల సంచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ట్రాక్‌‌‌‌ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. చిరుతలు తిరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న గ్రామాల శివార్లలో ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. రెండు చిరుతలను పట్టుకొని నల్లమల అడవిలో వదిలి పెట్టారు. ప్రజలు కూడా అలర్ట్‌‌‌‌గా ఉండాలని, గుట్టలపైకి ఎవరూ వెళ్లొద్దని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.

నీరు, ఆహారం కోసం వస్తున్నాయి 

నారాయణపేట జిల్లాకు సమీపంలో కర్నాటకలోని అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ ఉంది. అక్కడి నుంచి నీరు, ఆహారం కోసం చిరుతలు నారాయణపేట జిల్లాకు వస్తున్నాయి. గుట్టలు ఎక్కువగా ఉన్న మద్దూరు, కోస్గి ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో ఇప్పటికే నాలుగు చిరుతలు చనిపోగా, మిగతా వాటిని రక్షించేందుకు బోన్లు ఏర్పాటు చేశాం. చిరుతల సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాక్‌‌‌‌  కెమెరాలను ఏర్పాటు చేశాం. బోన్‌‌‌‌లో చిక్కిన చిరుతలను నల్లమలకు తరలిస్తాం. ఇప్పటికే రెండింటిని బంధించి లింగాల, అమ్రాబాద్‌‌‌‌ అడవుల్లో వదిలిపెట్టాం.  

కమాలొద్దీన్, జోగులాంబ జోన్‌‌‌‌ ఫ్లయింగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌