
- ఎంజీఎంలో పూర్తిస్థాయిలో పనిచేయని స్కానింగ్, ఎక్స్‌రే మెషీన్లు
- కేఎంసీలో పనిచేయని ఏసీలు.. ఆగిపోతున్న సర్జరీలు
- లిఫ్ట్‌లు పనిచేయక ఇబ్బందులు పడుతున్న డయాలిసిస్ పేషెంట్లు
- ఎంజీఎంకు వెళ్తే.. కేఎంసీకి వెళ్లాలని, కేఎంసీకి వెళ్తే.. ఎంజీఎంకే వెళ్లాలంటున్న డాక్టర్లు
వరంగల్/వరంగల్‌సిటీ, వెలుగు : ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు అయిన, కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ విషయంలో పేషెంట్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేఎంసీ ఆవరణలో పీఎం ఎస్‌ఎస్‌వై కింద రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎంజీఎంకు వచ్చే వారిని కేఎంసీకి పంపిస్తుంటే.. అక్కడికి వెళ్లిన వారిని తిరిగి ఎంజీఎంకు పంపుతున్నారు. దీంతో ఏ ట్రీట్‌మెంట్ ఎక్కడ చేస్తారో తెలియక పేషెంట్లు, వారి బంధువులు నానా అవస్థలు పడుతున్నారు. ఎంజీఎంలో పనితీరు మెరుగుపరించేందుకు మూడు నెలల కింది వరకు ఇంట్రస్ట్ చూపిన జిల్లా ఆఫీసర్లు ప్రస్తుతం సైలెంట్ అవడంతో పేషెంట్లను పట్టించుకునే వారే కరువయ్యారు.
ఆగిన ఆఫీసర్ల పర్యవేక్షణ
బీఆర్‍ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఎంజీఎంను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు పలుమార్లు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంజీఎం సమస్యలపై కొంత ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి మొదలు హెల్త్ మినిస్టర్, ఓరుగల్లు ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, గ్రేటర్ ఎమ్మెల్యేలు వరుసగా ఆఫీసర్లతో రివ్యూలు నిర్వహించారు.
దీంతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద రెగ్యులర్‌గా తనిఖీలు, మానిటరింగ్ చేయడంతో ఎంజీఎం పనితీరులో మార్పు కనిపించింది. ఏండ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన పరికరాలు తెప్పించారు. పెషేంట్లు తిరిగే వార్డుల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయడంతో పాటు డ్యూటీలకు డుమ్మా కొట్టిన డాక్టర్లు, సిబ్బందిని సస్పెండ్ చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిరోజు అందుబాటులో ఉండే డాక్టర్ల వివరాలను నోటీస్ బోర్డుల్లో రాయించారు.
దీంతో ఉమ్మడి జిల్లా జనాలకు ఎంజీఎంపై నమ్మకం పెరిగింది. కానీ ఇదంతా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. గత రెండు, మూడు నెలలుగా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టించుకోవడం మానేయడంతో ఎంజీఎం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వ పెద్దలు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎంజీఎంపై శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పనిచేయని స్కానింగ్, ఎక్స్‌రే మెషీన్లు
ఎంజీఎం హాస్పిటల్‌లో స్కానింగ్, ఎక్స్‌రే మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కష్టంగా మారింది. గుండెనొప్పితో వచ్చే వారికికీలక సమయాల్లో తీయాల్సిన ఈసీజీ పరికరాలు సరిగ్గా పనిచేయట్లేదు. ఎంజీఎంలోని 2డీ ఎకో మెషీన్‌ను కేఎంసీకి తరలించారు. దీంతో ఎంజీఎంకు వచ్చే పేషెంట్లను 2డీ ఎకో కోసం కేఎంసీ వెళ్లాలని చెబుతున్నారు.
తీరా అక్కడికి వెళ్లిన వారికి ఆ సేవలు 12 గంటల వరకే అందుబాటులో ఉంటాయని చెబుతుండడంతో బాధితులు ప్రైవేట్ డయాగ్నస్టిక్స్‌కు పరుగులు పెడుతున్నారు. మరో వైపు ఎంజీఎంలోని ఆరు ఎక్స్‌రే మెషీన్లలో కేవలం మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. నాలుగు స్కానింగ్ మెషీన్లు ఉంటే.. అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. మెషీన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ఎక్స్‌రే ఫిల్మ్‌పై గీతలు వస్తున్నాయి. దీంతో సమస్య నిర్ధారణ కష్టమవుతోంది. గతంలో ఎక్స్‌రే తీస్తున్న క్రమంలో ఓ మెషీన్ పెషేంట్‍పై పడడంతో గాయపడ్డాడు. మెషీన్లు సరిగా లేకపోవడంతో కట్లు కట్టి నడిపిస్తున్నారు.
సమస్యలకు కేరాఫ్‌గా కేఎంసీ
కేంద్ర ప్రభుత్వం పీఎం ఎస్‌ఎస్‌వై స్కీమ్‌లో భాగంగా రూ.150 కోట్లు ఖర్చు చేసి ఆరు అంతస్తుల్లో 250 బెడ్లతో వరంగల్ కేఎంసీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించింది. కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్ అంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీడియాట్రిక్ సర్జరీలకు కేఎంసీ కేరాఫ్‍గా నిలిచింది. లోకల్‍గానే ఈసీజీ, 2డీ ఎకో, స్టంట్లు వేయడం మొదలు బైపాస్ సర్జరీ వరకు ఉచిత సేవలతో ఎంజీఎంకు అండగా నిలిచింది.
కానీ ఇదంతా గతం.. ఇప్పుడు ఇదే హాస్పిటల్ సమస్యలకు కేరాఫ్‌గా మారింది. ఏసీలు సరిగా పనిచేయకపోవడంతో ఐసీయూ, రేడియాలజీ, ఎక్స్‌రే, సిటీ స్కాన్‌తో పాటు ఆపరేషన్ థియేటర్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సర్జరీలు ఆగిపోతున్నాయి. మరో వైపు హాస్పిటల్‌లో లిఫ్ట్‌లు ఎప్పుడు పనిచేస్తాయో.. ఎప్పుడు పనిచేయవో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గత వారం డయాలిసిస్ కోసం వచ్చిన వారు ఏకంగా ఐదో అంతస్తు వరకు మెట్లపైనే వెళ్లాల్సి వచ్చింది.