కుమ్రుంభీం జిల్లా పోడు భూముల సర్వేలో గందరగోళం

ఆసిఫాబాద్, వెలుగు : పోడు రైతులకు హక్కుపత్రాల పంపిణీ కోసం చేపట్టిన కోసం సర్వే కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో గందరగోళంగా ముగిసింది. అయితే ఏ ఊరు భూములకు ఆ ఆ గ్రామంలోనే  సర్వే చేశారు. దీంతో వేరే ఊరిలో భూమి ఉంటే ఆ ఊరిలో దరఖాస్తులు ఇవ్వాల్సి ఉండగా, కొందరు రైతులు అవగాహన లేక వారి సొంత గ్రామాల్లో దరఖాస్తులు ఇచ్చారు. దీంతో వారి భూముల సర్వే జరగలేదు. ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. పోడు భూముల హక్కు పత్రాల కోసం జిల్లా వ్యాప్తంగా 31,633 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు 76,800 ఎకరాల్లో అధికారులు సర్వే చేశారు. దీంతో హక్కు పత్రాలు అందుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రిజెక్ట్​ అయితే మళ్లీ గ్రామసభకు.. 

హక్కు పత్రాలు ఇచ్చేందుకు గ్రామకమిటీలు(ఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. వీటి ఆధారంగా ఫీల్డ్​లో ఫారెస్ట్, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది కమిటీలతో కలిసి సర్వే చేశారు. సర్వే అనంతరం విచారణ చేపట్టి మ్యాపులతో సహా గ్రామ కమిటీ నుంచి సబ్ డివిజన్ లెవల్ కమిటీ (ఎస్డీఎస్ఎల్)కి అందించారు. వీటిని సబ్ కమిటీ ప్రస్తుతం స్క్రూటీని చేస్తోంది. ఇందులో రిజెక్ట్ అయిన దరఖాస్తులను తిరిగి గ్రామ కమిటీకి పంపిస్తారు. రూల్స్​ ప్రకారం.. గిరిజనులైతే 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి గ్రామంలో ఉంటూ సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. సాగులో ఉండి దానిపైనే జీవనం ఆధారపడినట్లు గ్రామ పెద్దల వాంగ్మూలం ఉండాలి. లేకపోతే దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గిరిజనేతరులైతే 1930 కంటే ముందు నుంచి సుమారు 75 ఏండ్లు భూమిని సాగు చేస్తున్నట్లు  ఫ్రూఫ్ అందించాల్సి ఉంటుంది. సబ్ డివిజన్ లెవల్ కమిటీ చేసిన స్క్రూటీనీలో ఓకే అయిన దరఖాస్తులను డిస్ట్రిక్ లెవల్ కమిటీకి  సిఫారసు చేస్తారు. ఈ కమిటీ ఫైనల్ చేసిన వారికే హక్కు పత్రాలు వస్తాయి. 

శివారు మారితే చిక్కు ఇదీ....

ఏ గ్రామంలో అప్లికేషన్స్ అందిస్తే అదే గ్రామ శివారులో సర్వే చేస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది తమ సొంత గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారి భూములు సర్వే చేసే అవకాశం లేకుండా పోయింది. ఉట్నూర్ మండల రైతులు జైనూర్ మండల ప్రాంతంలో భూములు సాగుచేస్తున్నారు. కానీ అప్లికేషన్స్ ఉట్నూర్ మండలంలో ఇచ్చారు. ఉట్నూర్ లో సర్వే చేయడం కుదరదని జైనూర్​లోని మార్లవాయి గ్రామంలో సర్వే చేయాలని ఐటీడీఏ పీవో ఆ గ్రామ సెక్రటరీకి లిస్ట్ పంపించారు. అయితే మార్లవాయి గ్రామంలో అప్లై చేయకపోవడంతో భూములను సర్వే చేయలేదు. ఉట్నూర్ మండలంలోని లేండిగూడ, దామన్ పేట్ గ్రామాలకు చెందిన 40 మంది రైతుల భూములను సర్వే చేయలేదు దీంతో వారు హక్కు పత్రాలు పొందే అవకాశం కోల్పోయారు. తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. 

నేను అప్లై చేసినా సర్వే చేయలె

నేను దమన్ పేట్ జీపీలో అప్లై చేసిన. అది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఉంది. కానీ నేను సాగు చేస్తున్న భూమి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్​లోని మార్లవాయి పరిధిలోకి వస్తుంది. దమన్ పేట్ జీపీ కమిటీ సర్వే చేయలేదు. మార్లవాయిలోని లిస్ట్ లో పేరు లేదని వాళ్లు కూడా సర్వే చేయలేదు. నేను సాగు చేస్తున్న భూమిని గుర్తించి సర్వే చేసి నాకు న్యాయం చేయాలి.
- మెస్రం కిషన్ లేండోగూడ (ఆడగూడ ), ఉట్నూర్

తెల్వక దరఖాస్తు చేసినం..

నాది లెండిగూడ గ్రామం. ఉట్నూర్ మండలం దామన్ పేట్ జీపిలో దరఖాస్తు చేసిన. నా భూమి జైనూర్ మండలం మార్లవాయి శివారులో ఉంది. ఏ ఊరిలో భూమి ఉంటే అక్కడే దరఖాస్తు చేయాలన్న విషయం తెల్వక మా ఊరిలో దరఖాస్తు చేసిన. దీంతో ఆ భూమిని సర్వే చేయలే. నాకు న్యాయం చేయాలి.
 - మర్సకొల జైవంత్ రావు, లెండి గూడ

పరిశీలన ప్రక్రియ సాగుతోంది..

రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల ప్రకారం సర్వే పూర్తయింది.  గ్రామ సభల తర్వాత సబ్ డివిజన్ కమిటీ లో పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ ఓకే అయిన దరఖాస్తులను డిస్ట్రిక్ కమిటీ కి అందుతాయి. అక్కడ ఫైనల్ లిస్ట్ చేస్తారు. సర్కారు ఆదేశాల ప్రకారం.. అర్హులైన రైతులకు హక్కు పత్రాలు అందుతాయి.
- దినేష్ కుమార్, డీఎఫ్​వో, ఆసిఫాబాద్