స్కూళ్లలో సేఫ్టీ ఆడిట్​ ఏదీ

స్కూళ్లలో సేఫ్టీ ఆడిట్​ ఏదీ
  • స్ట్రక్చరల్, నాన్​స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్​ నిర్వహించని అధికారులు
  • ప్రతి ఏడాది తనిఖీ చేయాలని విద్యాశాఖ రూల్​
  • ఫైర్ సేఫ్టీ నిల్.. మాక్​ డ్రిల్స్​చేయరు 
  • డిజాస్టర్ ​మెనేజ్​మెంట్ పై అవగాహన కల్పించరు  
  • గ్రిల్స్, వాచ్​మెన్, ఫస్ట్​ ఎయిడ్​ కిట్స్​ కనిపించవు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని చాలా ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లలో కనీస సేఫ్టీ పాటించడం లేదు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లు కలిపి 3,300 పైగానే ఉన్నాయి. ఇందులో 691 ప్రభుత్వ స్కూల్స్​ఉన్నాయి. విద్యా శాఖ రూల్స్​ ప్రకారం ప్రతి స్కూల్​లో ప్రతి ఏడాది తప్పనిసరిగా స్ట్రక్చరల్, నాన్ స్ట్రక్చరల్​ఆడిట్ నిర్వహించాలి. స్కూళ్లలో డిజాస్టర్​మేనేజ్​మెంట్, ఫైర్​సేఫ్టీ కిట్స్, సీసీటీవీలు, వాచ్​మెన్, గ్రిల్స్ ఏర్పాటు ఇలా పలు రకాల నిబంధనలు అమలు చేయాలి.

వీటన్నింటిని చెక్​ చేయడానికి ఆడిట్​ నిర్వహించాలి. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలే రంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూల్​లో గేట్​ మీదపడి ఓ విద్యార్థి ప్రాణాలు వదిలాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదు.

పాత బిల్డింగుల్లో పాఠశాలలు 

సిటీలో చాలా స్కూల్స్​పాత బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. సర్కారు స్కూళ్లకు పక్కా బిల్డింగులు లేకపోవడంతో.. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిల్లో కనీస వసతులు, సేఫ్టీ మెజర్​మెంట్స్​ అసలే లేవు. కొన్ని బిల్డింగుల్లో అప్పుడప్పుడు విద్యార్థులపైన పెచ్చులూడుతున్నాయి. అసలు స్కూల్​ బిల్డింగ్స్ ​ఎంతవరకు సేఫ్​? రూఫ్, ఫ్లోర్ ​స్టోరేజీ, గోడలు బలంగా ఉన్నాయా?  ప్రహరీ ఎలా ఉంది? అనే విషయాలను ఏదైనా సంస్థ, నిపుణులతో ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్​ నిర్వహించాలి.

రిపోర్టును కేంద్ర ప్రభుత్వ యూడీఐఎస్ఈలో సమర్పించాలి. అలాగే స్కూళ్లలో నాన్​స్ట్రక్చరల్​ ఆడిట్​ కూడా నిర్వహించాలి. పిల్లలకు ఎలక్ట్రికల్స్, కంప్యూటర్స్, ల్యాబ్​ఎక్విప్​మెంట్స్ ఎలా ఉపయోగించాలో చెప్పాలి. కానీ, ఏ స్కూల్​లోనూ ఈ రూల్స్​పాటించలేదు. అసలు చాలామందికి ఈ రూల్స్​ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు.

మాక్​డ్రిల్స్​ ఎక్కడ

డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ ప్లాన్​లో భాగంగా స్కూళ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులు తమను తాము ఎలా రక్షించుకోవాలి? ఇతరులను ఎలా రక్షించాలి? అన్నది తెలియజేసేందుకు మాక్​డ్రిల్స్​నిర్వహిస్తూ ఉండాలి. అగ్రి ప్రమాదాలు, వరదలు, తుఫానులు సంభవించినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో.. డిజాస్టర్​ మేనేజ్​మెంట్ టీమ్స్​సహకారంతో స్టూడెంట్స్​కు అవగాహన​కల్పించాలి. ​ ఫైర్​సేఫ్టీ కిట్స్​ఏర్పాటు చేయాలి. వాటిని ఎలా వాడాలో చెప్పాలి.

స్కూల్​ప్రాంగణంలో సేఫ్టీ గైడ్​లైన్ బోర్డు, ఫస్ట్ ఎయిడ్​కిట్స్​ఏర్పాటు చేయాలి. ఒకవేళ స్కూల్​బిల్డింగ్​రెండు మూడు, అంతకు మించి అంతస్తులుంటే బాల్కనీల్లో గ్రిల్స్​ఏర్పాటు చేయాలి. స్కూల్ కు సమీపంలో ఉన్న రోడ్లపై మున్సిపల్​శాఖ సహకారంతో జీబ్రా క్రాసింగ్​ గీయాలి. స్కూల్​లో వాచ్​మెన్​ లేదా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలి. ఈ నిబంధనలన్నీ ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కాగితాలకే పరిమితమయ్యాయి. ఇకనైనా స్కూళ్లపై దృష్టి పెట్టి పిల్లల భద్రతకు భరోసానిచ్చి రంగారెడ్డి జిల్లాలో జరిగిన లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.