
- ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు
- స్టాఫ్ నర్స్ పోస్ట్‌కు రూ.3 లక్షలు వసూలు చేసిన కలెక్టరేట్ ఉద్యోగి
- ఫేక్ ఆర్డర్ ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
- కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆఫీసర్లు
- జనగామ కలెక్టరేట్‌లో దళారుల దందా
జనగామ, వెలుగు : జనగామ కలెక్టరేట్‌లో దళారుల హవా కొనసాగుతోంది. ‘మాకు ఆఫీసర్లు తెలుసు, మేం చెబితే పనులు అయిపోతయ్, ఉద్యోగాలు ఇప్పిస్తం, అవసరమైన పని చేసిపెడ్తం కాకపోతే కాస్త ఖర్చు అవుతుంది’ అంటూ వసూళ్లు చేస్తున్నారు. ఈ దందాకు కొన్ని శాఖల ఆఫీసర్లు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మరో శాఖ ఉద్యోగి డబ్బులు వసూలు చేశాడు. చివరికి ఫేక్ జాయినింగ్ ఆర్డర్ చేతిలో పెట్టడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. విషయం బయటకు పొక్కకుండా కాంప్రమైజ్ చేసేందుకు ఓ ఉన్నతాధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇప్పిస్తానని వసూళ్లు
జనగామ జిల్లా డీఎంహెచ్‌వో ఆఫీస్ స్టాఫ్ తనకు బాగా తెలుసని, వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇప్పిస్తానని కోఆపరేటివ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి సంజయ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిని నమ్మించాడు. జాబ్ రావాలంటే ఆఫీసర్లను మచ్చిక చేసుకోవాలంటూ సదరు వ్యక్తి నుంచి రెండేళ్ల కింద రూ. 3.20 లక్షలు వసూలు చేశాడు. అప్పటి నుంచి తన జాబ్ ఏమైందని బాధితుడు ఉద్యోగి చుట్టూ తిరగడం, అతడు దాటవేస్తూ రావడం పరిపాటిగా మారింది. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఇటీవల ఒత్తిడి పెంచడంతో సదరు ఉద్యోగి ఫేక్ ఆర్డర్ కాపీని తయారు చేసి ఇచ్చాడు. ఆ ఆర్డర్‌ను చూసి బాధితుడికి అనుమానం రావడంతో సదరు ఉద్యోగిని నిలదీశాడు. దీంతో ఫేక్ ఆర్డర్ కాపీ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయంపై వారం కింద ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు ఉద్యోగిని స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు.
ఉద్యోగిని కాపాడేందుకు పైరవీలు
బాధితుడు, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన వ్యక్తి ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో రాజీ కుదిర్చేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి తోడుగా మరో డిపార్ట్‌మెంట్ కీలక అధికారి కూడా రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేసేందుకు కష్టపడుతున్నారు. ‘కేసు పెడితే డబ్బులు తిరిగి రావు, డబ్బులు కావాలో ? కేసు కావాలో’ తేల్చుకోవాలంటూ బాధితుడిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరో వైపు బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. ఇదిలా ఉండగా కలెక్టరేట్‌లోని ధరణి, టీఎస్‌బీపాస్, సర్కారు స్కీమ్‌ల విషయాల్లో దళారుల జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీసర్లు స్పందించి దళారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.