నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ

నిజామాబాద్ జిల్లాలో  రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నిజామాబాద్, వెలుగు: పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం రైతుల అభిప్రాయాన్ని సేకరించనుంది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లాలోని నాలుగు చోట్ల సమావేశాలను నిర్వమించేందుకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు మోట్రాజ్​పల్లి, ఎడపల్లి, ఆర్మూర్​, ముప్కాల్​లో ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలోని సబ్​ కమిటీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడనుంది. 

​ ప్రతి సీజన్​లో జిల్లాకు రూ.257 కోట్లు

జిల్లాలో సాగు భూమి 5.80 లక్షల ఎకరాలు ఉంది. ప్రతి సీజన్​లో 2,55,461 మంది రైతులకు రూ.257.33 కోట్ల డబ్బును రైతు బంధు స్కీం కింద గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అందించింది. అనర్హులకు, పంటలు సాగు చేయని వారికీ రైతుబంధు అందిందని విమర్శలు వచ్చాయి.  దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం  లోపాలపై దృష్టి సారించింది. సాగుసాయం పారదర్శకంగా అందించేందుకు రైతుల నుంచే అభిప్రాయాలను సేకరించనుంది. బీఆర్​ఎస్​ సర్కారు రైతుబంధు ను రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వగా కాంగ్రెస్​ పార్టీ రైతు భరోసా కింద రూ.15 పెంచుతామని మేనిఫెస్టోలో చేర్చింది.

హామీ అమలులో భాగంగా అర్హులు మాత్రమే సాయాన్ని పొందాలని కసరత్తు చేస్తోంది. సాగుకు ఉపయోగపడని భూములు, అగ్రికల్చర్​ పేరుతో రియల్​ దందా చేసే వారిని రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయించింది. వందలాది ఎకరాలున్న పెద్ద రైతులు పెట్టుబడి సాయంగా పొందుతున్న తీరును రైతులందరితో చర్చించడానికి వీడియో కాన్ఫరెన్స్​ ఏర్పాటు చేసింది.

ఎన్ని ఎకరాలకు రైతు భరోసాను పరిమితం చేయాలి? ఇన్​కం ట్యాక్స్​చెల్లింపు తదితర అంశాలను చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లూ భట్టివిక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, శ్రీధర్​బాబు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్​రెడ్డితో కూడిన సబ్​ కమిటీని ఇందుకోసం సీఎం రేవంత్​రెడ్డి నియమించారు. జులై 15 నాటిని రిపోర్టు ఇవ్వాలని కోరారు. 

ఉదయం 9 గంటలకు షురూ.. 

జిల్లాలోని నాలుగు రైతు వేదికల వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​  ప్రారంభం అవుతుందని -డీఏఓ  వాజీద్​హుస్సేన్​ ‘వెలుగు’కు తెలిపారు.  రైతులు వచ్చి కమిటీ ప్రతినిధులకు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు.