- 1098 చైల్డ్ లైన్ నెంబర్ కు పెరుగుతున్న కాల్స్
- కౌన్సెలింగ్ ఇస్తున్న ఆగని వివాహాలు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఒక మైనర్ బాలిక ప్రేమలో ఉందని తల్లితండ్రులు పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా మైనర్ బాలిక 1098 కాల్ చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి సమయానికి వచ్చి పేరెంట్స్ కు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లి వాయిదా వేయించారు
నల్గొండ, వెలుగు: జిల్లాలో బాల్య వివాహాలు ఆగడం లేదు. చిన్న వయస్సులో వివాహాలు వద్దని ఆఫీసర్లు ప్రచారం చేస్తున్నప్పటికీ మైనర్లు పేరెంట్స్ పెండ్లి పీటపైకి ఎక్కిస్తున్నారు. కొన్ని పెళ్లిళ్లు గుట్టు చప్పుడు కాకుండా జరిపేస్తుండగా, మరికొన్ని ఆర్భాటంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పై ప్రేమ ప్రభావం ఉందని, కొన్ని రోజులైతే తమ పిల్లలు మాట వినరేమో నన్న ఆందోళనతో పేరెంట్స్తమ పిల్లల పెండ్లిళ్లకు ముహుర్తాలు పెట్టేస్తున్నారు. కొన్ని సార్లు మైనర్లే ఆఫీసర్లకు సమాచారం ఇచ్చి, తమకు పెండ్లి ఇష్టం లేదని చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నా అగడంలే..
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు 106 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 49, నల్గొండ జిల్లాలో 56 బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారంతో అధికారులు అక్కడికి వెళ్లి కౌన్సిలింగ్‌ఇచ్చారు. అధికారుల దృష్టికి రాకుండా కొన్ని చోట్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాలను ఆపేందుకు సూర్యాపేట జిల్లాలో 453 గ్రామ స్థాయీ బాలల పరిరక్షణ కమిటీ(వీసీ పీసీఎస్) లను ఏర్పాటు చేసి బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇటీవల సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మైనర్ల పెళ్లి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా వెనుకబడినవారు, ఆర్థికంగా బలంగా ఉన్న వారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే, అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. ప్రేమలో పడి తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తుందేమోనన్న భయంతో చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు.
కాల్ సెంటర్కు పెరుగుతున్న కాల్
బాల్య వివాహాలను అడ్డుకునేందుకు 1098 పై పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుండడంతో కాల్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సుమారు 50 కి పైగా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్స్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెళ్లి సమయానికి వచ్చి బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
గ్రామాలలో చైల్డ్ మ్యారేజెస్ ఆపడం కోసం గ్రామ స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ లను ఫామ్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చాం. గ్రామాల్లో జరిగే బాల్య వివాహాలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలలో బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా బాల్య వివాహం చేసినట్లయితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని రెండు సంవత్సరల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుంది. - నరసింహ రావు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి, సూర్యాపేట జిల్లా