- రాత్రి, పగలు కొనసాగిన పనులు
- పాలేరు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదలకు సన్నాహాలు
ఖమ్మం/ కూసుమంచి, వెలుగు : వర్షాలు, వరదల కారణంగా నాగార్జునసాగర్ కాల్వలకు పడిన గండ్లను ఆఫీసర్లు యుద్ధప్రాతిపదికన పూడ్చివేశారు. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పాటు సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఖమ్మం జిల్లాలో కాల్వకు ఐదు చోట్ల గండ్లు పడ్డాయి. పాలేరు పాత కాల్వకు పడిన గండిని రెండు రోజుల క్రితమే పూడ్చిన ఆఫీసర్లు నీటిని కూడా విడుదల చేశారు. ఇక హట్యాతండా దగ్గర మెయిన్ కెనాల్‌కు గండిపడగా, అండర్ టన్నెల్ కూడా కొంతమేర కూలిపోయింది.
పూడిన మట్టిన తీస్తున్న క్రమంలో యూటీకి మరో వైపు కూడా గోడ కూలిన విషయం బయటపడింది. ఇక్కడ చేపట్టిన పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ ఆఫీసర్లు మూడు రోజులుగా రాత్రి, పగలు పనులు కొనసాగిస్తున్నారు. అండర్ టన్నెల్ పడిపోవడంతో దానికి తాత్కాలిక రిపేర్లు చేసి, పడిపోయిన యూటీ కింది నుంచి పైప్‌లైన్ వేసి రెండు వైపులా గోడలు నిర్మించారు. ఏడు మీటర్ల కాల్వ కట్టకు మట్టిని పోసి గండిని పూడ్చివేస్తున్నారు.
300 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 11 మీటర్ల లోతుతో పనులు చేపట్టారు. పాలేరు రిజర్వాయర్ నుంచి ముందుగా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, ఆ తర్వాత క్రమంగా పెంచుతూ సాగునీరు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హఠ్యాతండా వద్ద జరుగుతున్న పనులను శుక్రవారం ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పరిశీలించారు. ఐబీ ఈ విద్యాసాగర్, ఎస్ఈ నర్సింగరావు, ఈఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్‌రెడ్డి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.