
- అందుబాటులో అంబులెన్సులు
- అధికారులతో నాగర్‌కర్నూల్ కలెక్టర్ రివ్యూ
ఎస్ఎల్బీసీ, వెలుగు టీం: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకే ఆఫీసర్లు చేరుకున్నారు. దాదాపు 9 గంటల వరకు అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు వచ్చారు. అయితే 9 గంటల ప్రాంతంలో అంబులెన్సులు వచ్చాయి. దీని వెనకాలే.. సంచార వైద్యశాల వాహనం కూడా టన్నెల్ వద్దకు చేరుకుంది. ఈ వాహనాలు వచ్చిన కొద్ది సేపటికే రెండు టీమ్‌ల డాక్టర్ల బృందం టన్నెల్ వద్దకు పోయింది.
10 గంటల ప్రాంతంలో సింగరేణి రెస్య్కూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీమ్ నుంచి 50 మంది టన్నెల్ వద్దకు వెళ్లారు. పదిన్నరకు టన్నెల్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన జయప్రకాశ్ గౌర్ హెలికాప్టర్ ద్వారా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. కంపెనీకి చెందిన కొందరితో మాట్లాడి.. పది నిమిషాల్లోనే తిరిగి హెలికాప్టర్లో వెళ్లిపోయారు. పదిన్నర గంటలకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ జేపీ క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్లారు.
అక్కడి నుంచి టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలపై సమీక్షించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సింగరేణి రెస్య్కూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీమ్ చెందిన 200 మంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మంచిర్యాల, గోదావరిఖని నుంచి వచ్చారు. టన్నెల్ వద్ద ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ సిబ్బంది 24 గంటలు సహాయక చర్యల్లోనే పాల్గొంటున్నారు. అయితే సాయంత్రం నాగర్‌కర్నూల్ డిప్యూటీ డీఎంహెచ్‌వో తారాసింగ్ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అలాగే ప్రమాదంలో గల్లంతైన గురుప్రీత్‌సింగ్ బాబాయ్‌లు ఇద్దరు టన్నెల్ వద్దకు వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో సింగరేణి రెస్య్కూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీమ్‌కు చెందిన మరో టీమ్ టన్నెల్లోకి వెళ్లింది.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయ్..
టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్‌ల మధ్య సమన్వయంతో సహాయక చర్యల్లో వేగం పెరిగిందన్నారు.
గల్లంతైన బాధితులను గుర్తించేందుకు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. ప్రమాద ప్రదేశంలోని నీటిని పైపుల ద్వారా బయటికి తరలిస్తూ, ప్లాస్మా గ్యాస్ కటర్లతో శిథిలాలను కట్ చేయిస్తున్నామన్నారు. కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగంలోకి తీసుకురానున్నామన్నారు. బురదను తీసేందుకు ఎస్కవేటర్లు టన్నెల్లోకి పంపించామని, ప్రత్యేక కెమెరాలు, సెన్సార్ల ద్వారా లోపలి పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన వివరించారు.