హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఓ విద్యుత్ వినియోగదారుడు కరెంటు బిల్లు చూసి షాక్ అయ్యాడు. సాయి ప్రభాత్ నగర్ కాలనీకి చెందిన గజ్జి ప్రభాకర్ 2017 లో తన ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ పవర్ నుంచి వచ్చిన కరెంట్‌ను తన ఇంటి అవసరాలకు పోగా మిగిలింది నెట్ మీటర్ ద్వారా గ్రిడ్ కు అటాచ్ చేసి అమ్ముకుంటున్నారు. ఈ కరెంట్‌కు మొన్నటి మార్చి వరకు రూ. 18 వేలు విద్యుత్ శాఖ ప్రభాకర్ కు బకాయి పడింది.
కాగా ఏప్రిల్ లో విద్యుత్ సిబ్బంది ప్రభాకర్ ఇంటి మీటర్ రీడింగ్ నమోదు చేసి రూ. 2 .72 లక్షలు బకాయి ఉన్నట్లు బిల్ జనరేట్ చేసి అందించారు. దీంతో ఆయన ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కరించకపోగా కనెక్షన్ తొలగించడానికి నోటీసు ఇచ్చారు. ఇదే విషయమై విద్యుత్ ఏఈ రాంప్రసాద్ వివరణ కోరగా.. గతంలో రీడింగులు నమోదు చేసేటప్పుడు సాంకేతికంగా జరిగిన పొరపాట్ల వల్ల తప్పుగా బిల్లు వచ్చిందన్నారు. టెక్నికల్ టీంతో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.