ఆఫీసర్లంతా అలర్ట్​గా ఉండాలి

గోదావరి వరద పరిస్థితులపై కలెక్టర్​రివ్యూ మీటింగ్​

భద్రాచలం, వెలుగు: గోదావరికి వరద పెరుగుతున్నందున ఆఫీసర్లంతా అలర్ట్​గా ఉండాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ డి.అనుదీప్​ పేర్కొన్నారు. రానున్న 48 గంటలు ఎంతో కీలకమని అధికారులు, సిబ్బంది ప్రతిఒక్కరూ ఫీల్డ్​లోనే ఉండాలని ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి 55 ఫీట్లకు చేరుకునే అవకాశం ఉన్నందున బుధవారం సబ్​కలెక్టర్​ ఆఫీస్​లో సెక్టోరియల్, జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్​రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేశారు. కలెక్టర్​మాట్లాడుతూ ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలీసు, రెవెన్యూ, సీఆర్పీఎఫ్​ ఆఫీసర్లు సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఐదు గ్రామాలకు వరద ముంపు పొంచి ఉన్నందున స్పెషల్​ఆఫీసర్లు పునరావాస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. బోట్లు, గజ ఈతగాళ్లు లోకల్ పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో నిత్యావసర సరుకులు, తాగునీరు, జనరేటర్లు, మందులు ఉంచాలన్నారు. భద్రాచలం టౌన్​లో బ్యాక్ వాటర్​ చేరకుండా ఇరిగేషన్​ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. దుమ్ముగూడెంకు ఎన్డీఆర్ఎఫ్ టీంలను పంపించామని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేయాలన్నారు. పినపాక, అశ్వాపురం,బూర్గంపాడు మండలాల్లోని ముంపు ప్రజలను అలర్ట్​చేయాలన్నారు. విస్తా కాంప్లెక్స్ వద్ద 15 మోటార్లతో డ్రైన్​బ్యాక్​ వాటర్​ను ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. గర్భిణులను వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించాలని డీఎంహెచ్​వోకు సూచించారు. కరెంట్​సప్లైలో అంతరాయం లేకుండా ఆఫీసర్లు చూడాలన్నారు. అనంతరం ఎస్పీ డా.వినీత్​తో కలిసి కలెక్టర్​కరకట్టపై నుంచి వరద ఉధృతిని పరిశీలించారు. 

వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధం ఉన్నాం.. 

భద్రాచలం,వెలుగు: గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య అన్నారు. బుధవారం గోదావరి కరకట్ట, విస్తా కాంప్లెక్స్ ప్రాంతాలను ఆయన సందర్శించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, శ్రీరాంసాగర్​, సమ్మక్క బ్యారేజ్​లకు వరద పోటెత్తుతుండటంతో గోదావరి పెరుగుతోందన్నారు. కరకట్ట వద్ద ఉన్న మోటార్లను పరిశీలించారు.