ఎల్ఆర్ఎస్​పై ఫోకస్ ఆ ప్లాట్ల యజమానుల్లో దడ

ఎల్ఆర్ఎస్​పై ఫోకస్ ఆ ప్లాట్ల యజమానుల్లో దడ
  • జనగామ జిల్లాలో మొత్తం 61 వేల పెండింగ్​ అప్లికేషన్లు
  • మున్పిపల్ ఆఫీస్​లో హెల్ప్​డెస్క్​ ఏర్పాటు
  • మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్​, పంచాయతీ శాఖల టీం వర్క్​

జనగామ, వెలుగు : ల్యాండ్ ​రెగ్యులరైజేషన్ ​స్కీమ్​(ఎల్ఆర్ఎస్)పై ఆఫీసర్లు స్పెషల్​ఫోకస్​ పెట్టారు. సర్కారు ఆదేశాలతో ప్లాట్ల క్రమబద్ధీకరణకు కసరత్తు చేస్తున్నారు. గత బీఆర్ఎస్​ హయాంలో జనగామ జిల్లా పరిధిలో 61,219 మంది ఎల్ఆర్ఎస్​ కోసం అప్లై చేసుకున్నారు. వీటిని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ ఆదేశాలతో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్​, పంచాయతీ శాఖల ఆఫీసర్లు టీం వర్క్ చేస్తున్నారు.

రూరల్​ లో ఎక్కువ

జిల్లాలో  మొత్తంగా 61,219 అప్లికేషన్లు పెండింగ్​లో ఉండగా, వీటిలో గ్రామీణ ప్రాంత ప్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. జనగామ మున్సిపల్​ పరిధిలో 18,379, గ్రామ పంచాయతీల్లో 35,412, కుడా పరిధిలో 7,428 అప్లికేషన్లు ఉన్నాయి. వీటన్నింటి వెరిఫికేషన్​కోసం అధికారులు బృందాలుగా ఏర్పడి ఫీల్డ్​విజిట్ చేస్తున్నారు. ఇందుకు మున్సిపల్, ఇరిగేషన్​, రెవెన్యూ, జిల్లా పంచాయతీ శాఖల అధికారులు సంయుక్తంగా పని చేస్తున్నారు. అసైన్డ్, చెరువు కుంటల శిఖం, ఈనాం, ఎండోమెంట్, వక్ఫ్​ బోర్డు భూముల్లో ప్లాట్లు ఉంటే వాటిని రిజెక్ట్​ చేయనున్నారు. 

ఇవన్నీ సరి చూసిన తదుపరి ఎల్ఆర్ఎస్ రుసుం వివరాలు సదరు ప్లాటు యజమానికి అందించనున్నారు. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్​ అయిన లేఅవుట్​ లేని వెంచర్​లు, ప్లాట్ల కోసం అప్పటి బీఆర్ఎస్​సర్కారు ఎల్ఆర్ఎస్​ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్లాట్ల యజమానులు రూ.వెయ్యి చెల్లించి మీ సేవల్లో దరఖాస్తులు చేసుకోగా, సదరు పెండింగ్ అప్లికేషన్లను ఇప్పుడు క్లియర్ చేయనున్నారు. తద్వారా సర్కారుకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరనుంది. 

ఆ వెంచర్ల పరిస్థితి ఏంటి?

బీఆర్ఎస్​ హయాంలో ఎక్కడ చూసినా అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. జనగామ కొత్తగా జిల్లాగా ఏర్పాటు కావడంతో పట్ణణంతోపాటు శివారు గ్రామాల్లో ఇష్టారీతిన రియల్టర్లు వెంచర్లు చేసి అమ్మేశారు. సాగు భూములను కొనుగోలు చేసి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ప్లాట్లు చేసి విక్రయించారు. అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధుల అండతో దందా యథేచ్ఛగా సాగింది. చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా అమ్మకాలు చేశారు.

 ఆ ప్లాట్లు కొన్న వారిలో ఇప్పుడు టెన్షన్​ నెలకొంది. ఫీల్డ్​వెరిఫికేషన్​ టైంలో అప్లికేషన్లు రిజెక్ట్​ అవుతాయనే ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రంలోని రంగప్ప చెరువులో సుమారు నాలుగెకరాల మేర అప్పట్లో కబ్జా పెట్టి ప్లాట్ల అమ్మకాలు సాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వందల ప్లాట్లు ఉండగా, వాటికి ఎల్ఆర్ఎస్ అనుమతి ఎలా ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు జిల్లాలోని పలు చెరువులు, కుంటలను ఆనుకుని చేసిన వెంచర్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మున్సిపల్​ లో హెల్ప్​ డెస్క్​

ఎల్ఆర్ఎస్​పై జనగామ మున్సిపల్ ఆఫీస్​లో హెల్ప్​ డెస్క్​ ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం 2020లో అప్లై చేసిన వారు తమ అప్లికేషన్​రిసిప్ట్, ప్లాటు రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్​జిరాక్స్​కాపీలను మున్సిపల్​టౌన్​ప్లానింగ్​ విభాగంలో అందించాలని కమిషనర్​ వెంకటేశ్వర్లు కోరారు. ఈ పథకం అమలును పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన హెల్ప్​ డెస్క్​లో సీనియర్​ అసిస్టెంట్​జగన్​ మోహన్​రెడ్డిని అందుబాటులో ఉంచామని, వివరాల కోసం 9393007768ను సంప్రదించాలని సూచించారు.