శాంతించిన గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు హెచ్చరిక

శాంతించిన గోదావరి  తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు హెచ్చరిక

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు:గోదారమ్మ శాంతిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, సమ్మక్క సాగర్​బ్యారేజీ, రామన్నగూడెం తదితర చోట్ల వరద తగ్గుముఖం పట్టింది. ములుగు జిల్లాలో మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉండడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కాళేశ్వరంలో సోమవారం జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను ఆఫీసర్లు ఉపసంహరించుకున్నారు. తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో ముంపు గ్రామాలకు చెందిన సుమారు వందల మంది ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. 

  • బైక్‌‌పై వెళ్లిన అడిషనల్​ కలెక్టర్‌..‌

భూపాలపల్లి జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు మంగళవారం గోదావరి పరీవాహక ప్రాంతాలైన పల్గుల, కుంట్లం గ్రామాలను విజిట్​చేశారు. మద్దులపల్లి క్రాస్ నుంచి పల్గులకు బైక్ పై వెళ్లి ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడానికి లైఫ్ బోట్లతో సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన ప్రకటించారు. 

  • అప్రమత్తంగా ఉండాలి

మహదేవపూర్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కావున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచను కలుపుతున్న ఉన్న అంతర్ రాష్ట్ర బ్రిడ్జ్ ను పరిశీలించారు. వరద సమస్యలు ఏర్పడితే వెంటనే ఎలాంటి నష్టం జరుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ఇందుకోసం శిక్షణ పొందిన సిబ్బందితోపాటు బోటు, డీడీఆర్ఎఫ్ టీమ్ ను అందుబాటులో ఉంచామని తెలిపారు.