భద్రాచలం, వెలుగు : భద్రాచలం టౌన్లోకి గోదావరి నుంచి చుక్కనీరు రానీయకుండా అడ్డుకోవడంలో ఆఫీసర్లు సక్సెస్ అయ్యారు. కరకట్టలపై ఉన్న స్లూయిజ్‌ల నుంచి వరద నీరు వచ్చి రామాలయం పరిసరాలు, సుభాష్‌నగర్ కాలనీ, అశోక్‌నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలు మునిగేవి. కానీ ఈసారి నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైనే ఫోకస్ పెట్టారు. స్లూయిజ్‌ల వద్ద ఇసుక బస్తాలు, మురుగునీరు నిల్వ ఉండకుండా ఎత్తిపోసేలా మోటార్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు.
మరో వైపు కూనవరం రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కరకట్ట నిర్మాణం జరుగుతోంది. అటు వైపు నుంచి వరద టౌన్లోకి రాకుండా విజయవాడ–-జగదల్పూర్ జాతీయ రహదారిని సరస్వతీ శిశుమందిర్ వద్ద మట్టి కట్ట పోశారు. వరద తగ్గాక ఈ కట్టను తొలగించనున్నారు. ఈ జాగ్రత్తలతో టౌన్లోకి వరద నీరు రాలేదు. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాటిని సీఐ సంజీవరావు ఆధ్వర్యంలో పోలీసులు ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేయించారు. 51.60 అడుగుల గరిష్ఠ వరద వచ్చినా టౌన్లోకి నీరు రాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.