- కేయూ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం
- కబ్జాకు గురైన భూముల విషయాన్ని పట్టించుకోని ఆఫీసర్లు
- ఏండ్లు గడుస్తున్నా పెండింగ్‌లోనే ల్యాండ్ కమిటీ రిపోర్ట్
- అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారంటున్న విద్యార్థి సంఘాలు
- ఆక్రమణదారులపై చర్యలు తీసుకున్నాకే కాంపౌండ్ నిర్మించాలని డిమాండ్
హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాల వ్యవహారం తెరమరుగైనట్లే కనిపిస్తోంది. రూ. కోట్లు విలువ చేసే యూనివర్సిటీ భూములను కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు కరువయ్యాయి. వర్సిటీ భూముల కబ్జాలను తేల్చేందుకు మూడేండ్ల కిందట కేయూ ల్యాండ్ కమిటీ రూపొందించిన రిపోర్ట్‌కు ఆమోదం లభించలేదు. ఇదిలా ఉంటే కబ్జాకు గురైన భూములను గుర్తించకుండానే కేయూ ఆఫీసర్లు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. దాదాపు రూ.10 కోట్లతో వర్సిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మిస్తుండడంతో భూముల ఆక్రమణల సంగతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆక్రమణలో లీడర్లు, ఆఫీసర్లు
కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం హనుమకొండలోని పలివేల్పుల, లష్కర్ సింగారం, కుమార్‌పల్లి గ్రామాల పరిధిలో మొత్తం 673.12 ఎకరాల భూములను సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో కుమార్‌పల్లి శివారులో 188.28 ఎకరాలు, లష్కర్ సింగారం శివారులో 309.20 ఎకరాలు, పలివేల్పుల శివారులో 175.14 ఎకరాలు ఉన్నాయి. అయితే సరైన రక్షణ లేకపోవడంతో క్యాంపస్ చుట్టూ ఉన్న భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లి రూ.కోట్ల విలువైన భూములను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కేయూ పోలీస్‌స్టేషన్, ఎస్సారెస్పీ కెనాల్, రేడియో స్టేషన్, ఫిల్టర్ బెడ్, విద్యుత్ సబ్‌స్టేషన్ తదితర అవసరాల కోసం సుమారు ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
ఇదిలా ఉంటే వర్సిటీకి ఒక వైపు వరంగల్ – -కరీంనగర్ హైవే ఉండగా, మిగతా మూడు వైపులా పలివేల్పుల శివారులోని 412, 413, 414, కుమార్‌పల్లి శివారులోని 229, లష్కర్ సింగారం శివారులోని 32 సర్వే నంబర్‌లో భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ ఆక్రమణదారుల్లో పొలిటికల్ లీడర్స్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులతో పాటు యూనివర్సిటీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. తరచూ ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో 2021లో వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వే చేయించారు. ఇందులో వర్సిటీ భూములు కబ్జాకు గురైంది నిజమేనని తేల్చారు.
హద్దులు నిర్ణయించకుండానే కాంపౌండ్ నిర్మాణం
కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఆక్రమణలు తొలగించి, చుట్టూ కాంపౌండ్ నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ల్యాండ్ కమిటీ రిపోర్ట్‌కు ఆమోదం లభిస్తేనే అక్రమార్కులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే గత వీసీ రమేశ్ కబ్జాలకు పాల్పడిన కొందరు ఆఫీసర్లను వెనకేసుకొస్తూ ల్యాండ్ కమిటీ రిపోర్ట్‌ను పక్కకు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో సర్వే చేయించి, హద్దులు నిర్ణయించడంతో పాటు వర్సిటీ చుట్టూ కాంపౌండ్ నిర్మిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు. ఈ మేరకు సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు మార్చి 10న శంకుస్థాపన కూడా చేశారు. హద్దుల నిర్ణయించి కాంపౌండ్ నిర్మాణ పనులు చేపడుతామని ఆఫీసర్లు కూడా చెప్పారు.
కానీ ఫిజికల్ సర్వే నిర్వహించకుండానే రెండు రోజుల కిందట కాంపౌండ్ పనులు స్టార్ట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. క్యాంపస్ చుట్టూ మొత్తంగా ఏడు కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతం ఎలాంటి వివాదాలు లేని వరంగల్ – కరీంనగర్ హైవే వైపు పనులు మొదలు పెట్టారు. కానీ చుట్టూ ఉన్న కబ్జాలు తొలగించి, హద్దులు నిర్ణయించకుండా కాంపౌండ్ ఎంతవరకు నిర్మిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే వర్సిటీకి చెందిన అధికారులు కమీషన్ల కోసం హడావుడిగా పనులు మొదలుట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా వర్సిటీ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించిన తర్వాతే కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని కేయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కాగితాల్లోనే ల్యాండ్ కమిటీ రిపోర్ట్
డీజీపీఎస్ సర్వే తర్వాత వర్సిటీ భూముల రక్షణ కోసం కేయూ ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. యూనివర్సిటీ ఏర్పాటు నుంచి భూముల వివరాలపై ఆరా తీసి 2021లోనే ఓ రిపోర్ట్‌ను తయారుచేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం కుమార్‌పల్లి శివారులోని 229 సర్వే నంబర్‌లో వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్‌బాబుతో పాటు మరో 17 మంది కబ్జాలో ఉన్నట్లు గుర్తించారు. అశోక్‌బాబు ల్యాండ్ కమిటీలో ఉండడంతో ఈసీ తీర్మానం మేరకు ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత ల్యాండ్ కమిటీ రిపోర్టును ఆమోదించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆఫీసర్లు ఆ దిశగా స్పందించలేదు.
అయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబు అప్పటి వీసీ తాటికొండ రమేశ్‌కు సన్నిహితుడు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపించాయి. వీసీల పదవీకాలం ముగిసిన తర్వాత ఏఆర్ అశోక్‌బాబును కేయూ నుంచి ఆర్ట్స్ కాలేజీకి ట్రాన్స్‌ఫర్ చేసి మమ అనిపించారు. కానీ అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆఫీసర్లు శ్రద్ధ చూపలేదు.