వడ్లు లేవు..బియ్యం రావు

వడ్లు లేవు..బియ్యం రావు
  • నాగర్​కర్నూల్​ జిల్లాలో సీఎంఆర్​పై దృష్టి పెట్టని ఆఫీసర్లు

నాగర్​ కర్నూల్, వెలుగు : ప్రభుత్వం కేటాయించిన వడ్లకు బియ్యం తిరిగి ఇవ్వాల్సిన రైస్​ మిల్లర్లు చూద్దాం తొందరేముందన్నట్లు వ్యవహరిస్తున్నారు. సీఎంఆర్​ ఇవ్వని మిల్లులను బ్లాక్​ లిస్ట్​లో పెట్టాల్సిన ఆఫీసర్లు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నెలాఖరులోగా 53 వేల మెట్రిక్​ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.

అయినా సంబంధిత ఆఫీసర్లు ఈ సీజన్​లో కొన్న వడ్లను తిరిగి వారికే కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది.​ వడ్ల అలాట్ మెంట్​లోనూ అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ ఆఫీసర్లు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

రెండేండ్లుగా పెండింగ్.. 

నాగర్​ కర్నూల్​ జిల్లాలో 2021 యాసంగిలో తీసుకున్న వడ్లకు సంబంధించిన బియ్యం ఇప్పటి వరకు తిరిగి ఇవ్వకపోయినా మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఎంఆర్​ 47 శాతం మాత్రమే ప్రభుత్వానికి చేరింది. ఇంకా 53వేల మెట్రిక్​ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. బియ్యం అందించేందుకు ఈ నెల 31 చివరి గడువుగా నిర్ణయించారు. 2022 యాసంగి వడ్లకు సంబంధించిన సీఎంఆర్​ కూడా పెండింగ్​లో ఉంది. మూడు సీజన్లకు సంబంధించి 1.30 లక్షల మెట్రిక్​ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం మిల్లుల్లో వడ్ల నిల్వలు కనిపించడం లేదు.

అయితే బియ్యం ఏవైనా సరే సీఎంఆర్​ తిరిగి ఇవ్వాల్సిందేనని మిల్లర్లకు గతంలో ఆఫీసర్లు వార్నింగ్​ ఇచ్చారు. దీంతో రేషన్​ డీలర్ల నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యంతో  పాటు ఛత్తీస్​ఘడ్​ నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని నేరుగా ఎఫ్​సిఐ గోదాముల్లో డంప్​ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్వాలిటీతో పని లేకుండా క్వాంటిటీ ఉంటే చాలన్నట్లు ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 

బియ్యం దందాలోకి లీడర్లు..

గత ప్రభుత్వం సీఎంఆర్  విధానం అమలులోకి తెచ్చిన తర్వాత మూతబడిన మిల్లులకు కొత్త కళ వచ్చింది. కొత్తగా లెక్కలేనని మిల్లులు వచ్చాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసిలు, కౌన్సిలర్లు,మార్కెట్​ చైర్మన్లు రైస్​ మిల్​ దందాలోకి ఎంటరయ్యారు. జిల్లాలో 10 బాయిల్డ్  రైస్​ మిల్లులు,91 రా మిల్లులు ఉన్నాయి.

ఈ రెండేండ్లలో మిల్లుల సంఖ్య రెండింతలు పెరిగిందంటే వడ్ల దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్​లో సీఎంఆర్​ క్లియరెన్స్​తో సంబంధం లేకుండా సిండికేట్ల ద్వారా వచ్చే మిల్లులకు వడ్లు అలాట్​ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో జిల్లా ఉన్నతాధికారినే తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి.

53 వేల మెట్రిక్​ టన్నులు రావాలి..

2021​ సీజన్​లో ఇచ్చిన వడ్లకు సంబంధించి మిల్లర్ల నుంచి ఇంకా 53 వేల మెట్రిక్​ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నాం. గడువులోగా ఇవ్వకపోతే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

బాలరాజు, సివిల్​ సప్లై డీఎం