- బీఆర్ఎస్, బీజేపీ కుతంత్రాలు ప్రజలకు అర్థమైనయ్
- రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్సేనని ధీమా
కోల్ బెల్ట్, వెలుగు: ఓటమి భయంతోనే తన ఇంటిపై ఐటీ దాడులు చేయించారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ కు, చెన్నూర్‌లో బాల్క సుమన్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా నా ఇండ్లు, సంస్థలపై ఐటీ, ఈడీ అధికారులతో రెయిడ్స్ చేయించారు.12 గంటల పాటు సోదాలు చేసిన ఆఫీసర్లు.. చివరకు ఖాళీ చేతులతో వెళ్లిన్రు. ఇంతకు నేను చేసిన తప్పేంటో? ఈ తనిఖీలు ఎందుకు చేయించాడో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్‌కు దమ్ముంటే నాతో రాజకీయంగా కొట్లాడాలి” అని సవాల్ విసిరారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సుబ్బారాంపల్లి, రాయపేట, నారాయణపూర్, దుగ్నేపల్లి, ఇన్కంపేట, సుందరశాల, నర్సక్కపేట, ముత్తరావుపల్లి, సోమనపల్లి, నాగపూర్ గ్రామాల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మూల రాజిరెడ్డితో కలిసి వివేక్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఓటమి భయంతోనే దాడులు చేయించి, ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు. ఐటీ, ఈడీ దాడుల వెనుక బీఆర్ఎస్, బీజేపీ కుట్ర ఉంది. కేసీఆర్లక్ష కోట్లు దోచుకున్నాడని ఆరోపిస్తున్న బీజేపీ.. ఎందుకు విచారణ చేయట్లేదు. కవిత లిక్కర్ స్కామ్కేసు ఏమైంది? మేం ఆధారాలిచ్చినా అమిత్ షా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?’’ అని వివేక్ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు అర్థమయ్యాయని... అటు రాష్ట్రంలో, ఇటు చెన్నూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని చెప్పారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు పరిహారమేదీ?
కమీషన్ల కోసం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు అందలేదని.. కానీ బ్యాక్ వాటర్ వల్ల చెన్నూరు నియోజవర్గంలో వేల ఎకరాల్లో పంటలు, ఇండ్లు మునిగిపోయాయని వివేక్ చెప్పారు. నాలుగేండ్లు గడుస్తున్నా బ్యాక్వాటర్బాధితులను సుమన్ గానీ, కేసీఆర్ గానీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి నష్టపరిహారం ఇయ్యాలనే సోయి ఇద్దరికీ లేదని ఫైర్ అయ్యారు. ‘‘కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో సుందరశాల గ్రామం ఎక్కువగా నష్టపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రామాన్ని దత్తత తీసుకుని కరకట్ట నిర్మించేందుకు కృషి చేస్తాం” అని హామీ ఇచ్చారు. ‘‘బాల్క సుమన్ కు అక్రమ ఇసుక దందా తప్ప, ప్రజల కష్టాలు పట్టవు. కాళేశ్వరంలో కేసీఆర్ రూ.70 వేల కోట్లు దండుకుంటే.. ఆయన దత్త పుత్రుడు బాల్క సుమన్ ఇసుక దందాలో వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. అలాంటి వ్యక్తులను చిత్తుగా ఓడించాలి” అని పిలుపునిచ్చారు. కాగా, పలువురు బీఆర్ఎస్లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. వివేక్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వివేక్ కాన్వాయ్ తనిఖీ..
వివేక్ కాన్వాయ్ ని పోలీసులు తనిఖీ చేశారు. బుధవారం ఉదయం మంచిర్యాల నుంచి చెన్నూరు లో ప్రచారం చేసేందుకు వివేక్ బయలుదేరగా.. నస్పూర్ మండలం సీసీసీ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు ఆయన కాన్వాయ్ ని ఆపి తనిఖీ చేశారు.
వివేక్‌ను గెలిపించుకుందాం: మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం
కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముల సంపత్ అన్నారు. బుధవారం చెన్నూరులో వివేక్ వెంకటస్వామిని సంఘం నేతలు కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామితోనే చెన్నూర్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆయనకు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పోతగల శ్రీనివాస్, కొమ్ముల శ్రీనివాస్, యాదగిరి, పవన్, శివ, నవీన్, భాస్కర్, శ్రీనివాస్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : పాకెట్ మనీ కోసం ప్రచారానికి స్టూడెంట్స్.. ఒక్కొక్కరికి రూ.400
ఐటీ సోదాల్లో రెండు చిప్పలు దొరికినయ్
ఒకటి కేసీఆర్‌కు, ఇంకోటి బాల్క సుమన్‌కు : సరోజా వివేక్
కోల్ బెల్ట్, వెలుగు: ‘బీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కావాలనే ఐటీ రెయిడ్స్చేయిస్తున్నారు’ అని చెన్నూర్ కాంగ్రెస్అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ విమర్శించారు. ‘మా ఇండ్లు, సంస్థలపై కేసీఆర్, బాల్క సుమన్ ఐటీ,ఈడీ రైడ్స్ చేయించారు.. సోదాల్లో రెండే చిప్పలు దొరికాయి.. వాటిలో ఒకటి కేసీఆర్, మరొకటి బాల్క సుమన్ తీసుకోవాలి’’ అని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం వివేక్ తరఫున సరోజా వివేక్.. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి మందమర్రిలోని రాజీవ్ నగర్ , శాంతి నగర్ లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెన్నూర్ నియజకవర్గంలో కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి, వినోద్ హయాంలో వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయి తప్ప బీఆర్ఎస్ హయాంలో కొత్తగా వేసిన రోడ్లేవీ లేవన్నారు. ‘100 కేసులు నావి..100 కోట్లు వివేక్ వి’ అంటూ గతంలో చెప్పుకున్న బాల్క సుమన్ కు ఇప్పుడు వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.