తెలంగాణ తల్లి చిత్రం, రూపాన్ని వక్రీకరిస్తే నేరం.. అగౌరవపరిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక

తెలంగాణ తల్లి చిత్రం, రూపాన్ని వక్రీకరిస్తే  నేరం.. అగౌరవపరిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక
  • విగ్రహ నమూనాను అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం
  • తెలంగాణ తల్లి జాతి అస్థిత్వ, ఆత్మగౌరవ ప్రతీక
  • బహిరంగంగా, సోషల్ మీడియాలో అగౌరవపరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఆమె చిత్రం, రూపాన్ని వక్రీకరిస్తే నేరమని పేర్కొన్నది. ఈ మేరకు సోమవారం సీఎస్​శాంతి కుమారి అచ్చ తెలుగులో జీవో నంబర్​1946ను జారీ చేశారు. తెలంగాణ తల్లి జాతి అస్థిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి.. చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్​ మీడియాలో మాటలు, చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్టు జీవోలో పేర్కొన్నది.

తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను అధికారికంగా గుర్తిస్తూ జీవో జారీ చేసినందున కొన్ని నియమ, నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించినట్టు జీవోలో పేర్కొన్నది.