- అధికారికమన్న మంత్రి హరీశ్‌రావు
- పార్టీ మీటింగ్ అన్న కలెక్టర్
- స్టేజీపై ఎమ్మెల్యే కొడుకు.. కింద కూర్చున్న ఆర్డీఓ వినోద్
మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన వైద్యా రోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన కార్యక్రమం అఫీషియల్ ప్రోగ్రామా? లేక పార్టీ మీటింగా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. శంకుస్థాపన తర్వాత నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు ..కలెక్టర్ రవిని స్టేజీపైకి రావాలని కోరారు. అప్పటికే కలెక్టర్ వెళ్లిపోయారని అక్కడే ఉన్న అధికారులు చెప్పారు.
దీంతో మంత్రి హరీశ్‌రావు ..‘ఇది పార్టీ ప్రోగ్రాం అనుకొని వెళ్లిపోయారు కావచ్చు’ అని అన్నారు. తర్వాత అక్కడే స్టేజీ కింద ఓ పక్కన కూర్చున్న ఆర్డీఓ వినోద్ కుమార్ ను మాత్రం పైకి పిలవలేదు. ఎలాంటి పదవి లేని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు కల్వకుంట్ల సంజయ్ ను మాత్రం స్టేజీ పైన కూర్చోబెట్టారు. ఈ విషయమై కలెక్టర్ రవిని వివరణ కోరగా శిలాఫలకం ఆవిష్కరణ మాత్రమే అధికారిక కార్యక్రమమని అన్నారు. పబ్లిక్ మీటింగ్ అధికారికం కాదని, పార్టీ కార్యక్రమమని స్పష్టం చేశారు. కానీ మంత్రి హరీశ్ రావు మాత్రం మీటింగ్ అఫీషియల్ అని స్పష్టం చేశారు.