![వర్గీకరణలో నేతకానిలకు అన్యాయం : జనగామ తిరుపతి](https://static.v6velugu.com/uploads/2025/02/official-spokesperson-janagama-tirupati-expressed-his-grief--there-was-immense-injustice-done-castes-in-sc-classification_0dAjafBYmH.jpg)
చెన్నూరు, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులస్తులకు తీరని అన్యాయం జరిగిందని నేతలని సంఘం మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి జనగామ తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరులోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ నేతకాని కులస్తులు 15 నుంచి 16 లక్షల వరకు జనాభా ఉందన్నారు. కానీ తమ కులాన్ని తగ్గించి కేవలం లక్షా 30 వేల మంది మాత్రమే ఉన్నట్లు తప్పుడు నివేదిక అందించారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి నేతకాని కులగణన సర్వేను మరోసారి నిర్వహించాలని కోరారు. నేతకాని కులాన్ని ఎస్సీ (ఏ)లోనే ఉంచాలని, లేకుంటే గతంలో ఉన్నట్లు ఎస్సీ (బీ)లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నేతకాని కులానికి మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజకీయాల లబ్ధి కోసం మందకృష్ణ మాదిగతో, బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు
ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి తిరుపతి ధన్యవాదాలు తెలిపారు. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారని, అసెంబ్లీలోనూ నేతకాని కార్పొరే షన్ ఏర్పాటుకు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. వివేక్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వెంకటేశ్ నేతను హెచ్చరించారు. నేతకాని మహా సంఘం జిల్లా అధ్యక్షుడు రాంటెంకి పోచం, మాజీ ఎంపీపీ దుర్గం వెంకటస్వామి, రావుల తిరుపతి, దుర్గం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.