పన్ను వసూలుకు పాట్లు..మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ కలెక్షన్​ వెరీ స్లో

పన్ను వసూలుకు పాట్లు..మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ కలెక్షన్​ వెరీ స్లో
  • ఇప్పటివరకు 50 శాతమే వసూలు
  • మరో మూడు రోజులే గడువు 
  • బకాయిల చెల్లింపులకు మొండికేస్తున్న పబ్లిక్​
  • ఇండ్లకు తాళాలు వేస్తున్నా.. నో రెస్పాన్స్​ 
  • ఆర్థిక ఇబ్బందుల్లో మున్సిపాలిటీలు

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్​ కోసం అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 2024-–25 ఆర్థిక సంవత్సరం గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో ఈలోగా వందశాతం ట్యాక్స్​ వసూలుకు ట్రై చేస్తున్నారు. మున్సిపల్​ వార్డుల వారీగా ప్రత్యేక టీములను నియమించి కలెక్షన్​ స్పీడప్​ చేశారు.

కొన్నేండ్లుగా వేలల్లో బకాయిపడ్డవారికి రెడ్​ నోటీసులు జారీ చేసి ఆస్తులు జప్తు చేస్తామని వార్నింగ్​ ఇచ్చారు. అయినప్పటికీ బిల్డింగ్​ ఓనర్ల నుంచి సరైన రెస్పాన్స్​ లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సర్కారీ ఆస్తులకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. ఓవైపు ప్రభుత్వం వందశాతం ట్యాక్స్​వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు ఆశించినంత కలెక్షన్​ లేకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. 

మున్సిపాలిటీల వారీగా బకాయిలు

2024-–25 ఆర్థిక సంవత్సరంలో మంచిర్యాల మున్సిపల్​ కార్పొరేషన్​తో పాటు 5 మున్సిపాలిటీల్లో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మంచిర్యాల కార్పొరేషన్​ పరిధిలో రూ.26.88 కోట్ల డిమాండ్​కు గాను ఇప్పటివరకు రూ.13 కోట్లు (50 శాతం) మాత్రమే వసూలైంది. మంచిర్యాల గ్రేడ్​1 మున్సిపాలిటీని ఇటీవల కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ చేస్తూ నస్పూర్​ మున్సి పాలిటీతో పాటు హాజీపూర్​ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేయడం తెలిసిందే. క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో రూ.4 కోట్ల ట్యాక్స్ డిమాండ్​ ఉండగా, రూ.2.69 కోట్లు వసూలు చేశారు.

మందమర్రి మున్సిపాలిటీలో రూ.2.30 కోట్లకు గాను రూ.1.61 కోట్ల కలెక్షన్​ సాధించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో రూ.3.38 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.2.12 కోట్లు రాబట్టగలిగారు. చెన్నూర్​ మున్సి పాలిటీలో రూ.2.86 కోట్లకు రూ.1.60 కోట్లు వసూలైంది. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో రూ.1.69 కోట్లకు గాను రూ.1.36 కోట్ల (81 శాతం) కలెక్షన్​లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో టాప్​లో నిలిచింది. 

వడ్డీ రాయితీ ప్రకటించిన సర్కారు

మున్సిపాలిటీల్లో భారీగా పేరుకుపోయిన బకాయిలను రాబట్టుకునేందుకు ప్రభుత్వం ఇటీవల వడ్డీ రాయి తీని ప్రకటించింది. వన్​ టైమ్​ సెటిల్​మెంట్​ (ఓటీఎస్) కింద బకాయిలను క్లియర్​ చేసినవారికి వడ్డీపై 90 %​ రాయితీ ఇస్తూ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు చెల్లించిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం ట్యాక్స్​లో రాయితీ వర్తిస్తుంది. అయితే, మూడు రోజులు మాత్రమే గడువు ఉండడం, పండుగ సెలవులు రావడంతో ఎంతమేరకు వసూలు అవుతుందనేది అనుమానమే. ఈ ఉత్తర్వులు 15 రోజుల ముందు ఇచ్చి ఉంటే పన్ను చెల్లిం పుదారులకు వెసులుబాటు లభించేది. 

ఆర్థిక సమస్యల్లో మున్సిపాలిటీలు

డిమాండ్​కు అనుగుణంగా ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్స్​ కాకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు నిలిచిపోవడం వల్ల మున్సిపాలిటీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15 ఫైనాన్స్​ నిధులు నిలిచిపోగా, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి ఫండ్స్​ సైతం రెగ్యులర్​గా రిలీజ్​ చేయడం లేదు.

ఈ క్రమంలో ప్రాపర్టీ ట్యాక్స్ ​పైనే మున్సిపాలిటీలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ మొత్తాన్ని జనరల్​ ఫండ్​లో జమచేసి కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది జీతాల చెల్లింపుతో పాటు ఇతర అవసరాలకు వాడుకునే వెసు లుబాటు ఉండేది. కానీ, డిమాండ్​ మేరకు టాక్స్​ కలెక్షన్​ కాకపోవడంతో ఉద్యోగుల జీతాలకూ ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు వాపోతున్నారు. 

ట్యాక్స్​లు చెల్లిస్తేనే  డెవలప్​మెంట్

ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్తులకు సంబంధించిన బకాయిలను వసూలు చేసేందుకు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నాం. ట్యాక్స్​ వసూలు కోసం వెళ్లిన సిబ్బందిపై కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాదేశాల మేరకే మేము చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్​గా ట్యాక్స్​లు చెల్లిస్తేనే మున్సిపాలిటీలో డెవలప్​మెంట్​ వర్క్స్​ చేయగలం. బకాయిదారులు అర్థం చేసుకొని మాకు సహకరించాలి. ప్రభుత్వం ప్రకటించిన 90 శాతం వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - టి.శివాజీ, మంచిర్యాల కార్పొరేషన్​ కమిషనర్​

ఇవీ ఇబ్బందులు

 మంచిర్యాల వంద ఫీట్ల రోడ్​లోని ఓ బిల్డింగ్​ యజమాని ఐదు సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్​ చెల్లించడం లేదు. రూ.35వేల బకాయిలు రాబట్టడం కోసం మున్సిపల్​ అధికారులు అతనికి రెడ్​ నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. ఐదు రోజుల కిందట వెళ్లిన అధికారులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపులకు దిగాడు.

దీంతో అధికారులు ఇంటి గేట్​కు తాళం వేశారు. దిగొచ్చిన బిల్డింగ్​ యజమాని వెంటనే బకాయిలు చెల్లించాడు.  చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్​, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులకు పదేండ్లుగా ట్యాక్స్​ చెల్లించడం లేదు. బకాయిలు సుమారుగా రూ.3.50 లక్షలు పేరుకుపోయాయి. దీంతో మున్సిపల్​ సిబ్బంది ఈ రెండు ఆఫీసులకు తాళం వేశారు. వెంటనే స్పందించి త్వరలోనే బకాయిలు క్లియర్​ చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో తాళం తీశారు. 

ఇలా ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్తులకు సంబంధించి కోట్ల రూపాయలలో పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్​ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెడ్​ నోటీసులు జారీ చేసినా, ఆస్తులు జప్తు చేస్తామని వార్నింగ్​ ఇచ్చినా కూడా బకాయిదారులు లైట్​ తీసుకుంటున్నారు. కొంతమంది బడా వ్యాపారులు, చోటామోటా లీడర్లు మున్సిపల్​ అధికారులనే బెదిరిస్తున్నారని వాపోతున్నారు.