- రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నమోదు
- మర్యాలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
- జిల్లా అంతటా ఆరంజ్ అలర్ట్
- బయటకు రావడానికి జంకుతున్న జనం
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు రెడ్అలర్ట్ ప్రకటించారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఆరంజ్అలర్ట్ ప్రకటించారు. ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు.
44.6 డిగ్రీల ఉష్ణోగ్రత..
గత నెల మొదటి వారం నుంచి మూడో వారం వరకు జిల్లాలో 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే నెలలో 26 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. మధ్యలో రెండు రోజులు వాతావరణంలో మార్పుల కారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పటి నుంచి రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ సీజన్లో అత్యధికంగా శుక్రవారం బొమ్మలరామారం మండలం మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణశాఖ రెడ్అలర్ట్ ప్రకటించింది. ఎనిమిది చోట్ల 43 డిగ్రీలు దాటింది. మరో 18 చోట్ల 41.1నుంచి 42.8 డిగ్రీలు నమోదైంది.
వేడితో ప్రజలు ఉక్కిరి బిక్కిరి..
ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలు ఎండ వేడిమి తట్టుకోలేక త్వరగా పనులు ముగించుకొని వెళ్లిపోతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్నప్పటికీ ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. కరెంట్ వినియోగం కూడా పెరిగింది. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్డిపార్ట్మెంట్ ప్రచారం చేపట్టింది. వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ఆశ కార్యకర్తలు, అంగన్ వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.