యాదాద్రి, వెలుగు: భువనగిరి లోక్‌సభ స్థానంలో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు అధికారులు ఆదివారం ఓటరు జాబితాను ప్రకటించారు. భువనగిరి లోక్‌సభ పరిధిలోకి భువనగిరి, మునుగోడు, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తితో పాటు జనగామ, రంగారెడ్డి జిల్లాలోనిఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు వస్తాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్ట్‌లో 17,98,704 ఓటర్లు ఉండగా మార్పు చేర్పుల అనంతరం 18,00,398 ఓటర్లు ఉన్నట్టు ఆఫీసర్లు వెల్లడించారు. మొత్తం 1694 మంది ఓటర్లు పెరిగారు. భువనగిరి అసెంబ్లీలో మాత్రం 269 మంది ఓటర్లు తగ్గారు.
మహిళా ఓటర్లే ఎక్కువ
ఈ లోక్‌సభ స్థానంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుష ఓటర్లు 8,94,789 ఉండగా మహిళా ఓటర్లు 9,05,531 ఉన్నారు. పురుషుల కంటే 10,742 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండగా మిగిలిన ఆరింటిలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. 78 మంది థర్డ్ జెండర్ల ఓట్లు ఉండగా ఇబ్రహీంపట్నంలో 35, ఆలేరులో 19 , మిగిలిన నియోజకవర్గాల్లో 24 ఓట్లు ఉన్నాయి.
2142 పోలింగ్ స్టేషన్లు
భువనగిరి లోక్‌సభ సెగ్మెంటల్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు కిలోమీటర్లకు ఓ పోలింగ్ స్టేషన్ చొప్పున మొత్తం 2141 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులోకి తేనున్నారు. 54 ఎంసీసీ టీమ్స్, 23 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 23 స్టాటిస్టికల్ సర్వేయర్ టీమ్స్, 9 వీడియో వీవింగ్ టీమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేయనున్నాయి.
ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
యాదాద్రి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ జెండగే కోరారు. ఆదివారం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినందున జిల్లాలో శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. అధికారులు కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉందని, అర్హులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో తొమ్మిది చెక్ పోస్టుల ద్వారా నిఘా పెట్టామని, నగదు, మద్యం, అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని సూచించారు. తనిఖీల్లో పట్టుకున్న సొమ్మును గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, తగిన ఆధారాలు చూపిస్తే తిరిగి విడుదల చేస్తామని చెప్పారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్లు పీ బెన్ షాలోమ్, గంగాధర్, ఏవో జగన్
పాల్గొన్నారు.