మరో సంగ్రామానికి సై .. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ

  • ఓటరు జాబితాపై శిక్షణ 
  • ఉమ్మడి జిల్లాలో 1508 గ్రామ పంచాయతీలు
  • 66 జడ్పీటీసీ, 567 ఎంపీటీసీ స్థానాలు
  • ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న పార్టీలు

ఆదిలాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా తయారు చేసేందుకు సిద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొత్త ఓటరు జాబితాపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇప్పించారు. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా తయారు చేయడంలో ఎలాంటి తప్పులు దొర్లకూడదని, వార్డుల వారీగా గ్రామ పంచాయతీ  ఓటర్ల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లు సమర్థంగా నిర్వహించిన అధికారులు.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

బ్యాలెట్​ బాక్సుల్లో..

గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం జూలైలో పూర్తయ్యింది. గ్రామ పంచాయతీల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, ఆర్వో బుక్​లు, బ్యాలెట్ బాక్సులు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు. అటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల బుక్​లెట్లు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1508 గ్రామ పంచాయతీలు, 12,780 వార్డులు ఉన్నాయి. 567 ఎంపీటీసీ స్థానాలు, 66 జడ్పీటీసీ స్థానాలున్నాయి. పోలింగ్ కేంద్రాలు దాదాపు 3 వేలు ఉండగా, 22 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 2019 జరిగిన పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించగా, ఈ సారి కూడా విడతల వారీగా నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పార్టీలు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. 

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్లపైనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ప్రభుత్వం రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గతంలో నిర్వహించిన రిజర్వేషన్ల ప్రకారమే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు ఒకే రిజర్వేషన్ ఉండేలా చట్టం తీసుకొచ్చింది. దీంతో 2019లో జరిగిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా లేదా నూతన పద్ధతిలో నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో అటు ఆశావహులు సైతం అయోమయంలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.