భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కొరడా

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కొరడా
  • గోదావరి తీరంలో ఇసుక ర్యాంపులపై నిఘా
  • ఇంటిలిజెన్స్ వర్గాల నివేదికలతో సర్కారు నిర్ణయం 
  • ర్యాంపుల వద్ద తనిఖీలు..ఓవర్​లోడింగ్ పై ఉక్కుపాదం
  • ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై తరలించినా అడ్డుకుంటున్న అధికారులు
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 17 ర్యాంపులతో అగ్రిమెంట్ల నిలిపివేత

భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గోదావరి తీరంతో పాటు, వాగుల నుంచి తెచ్చే ఇసుకపై నిఘాను పెంచారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన నివేదికలతో సీఎం రేవంత్​రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ రవాణాను అరికట్టి, తక్కువ ధరకు, ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుకను అందించేలా యాక్షన్​ ప్లాన్​ తయారు చేశారు. 

ఓవర్​ లోడ్​పై తనిఖీలు..

ఇసుక ర్యాంపుల్లో రేజింగ్​ కాంట్రాక్టర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వారు బుక్​ చేసుకున్న దానికంటే అదనంగా ఇసుకను లోడ్​ చేసి రూ.12వేలు వసూలు చేస్తున్నారు. లోడింగ్​ ఛార్జెస్ పేరుతో రూ.2,500 తీసుకుంటున్నారు.14 చక్రాల లారీలో 32 టన్నులు, 16 చక్రాల లారీలో 35 టన్నులు ఇసుకను లోడ్ చేస్తున్నారు. వసూలు చేసే సొమ్మే ఒక్క రోజులో రూ.2,30,72,000 అంటూ స్వయంగా లారీ ఓనర్స్ అసోషియేషన్​ మైనింగ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది.  ఓవర్​ లోడ్​ లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయి.  ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. దీనిపై కలెక్టర్​ ఆదేశాలతో రెవెన్యూ, టీజీఎండీసీ, పోలీస్​ టీమ్స్​ ర్యాంపుల వద్ద తనిఖీలు చేపడతూ ఓవర్​ లోడ్​పై ఉక్కుపాదం మోపుతున్నాయి. 

ఎడ్లబండ్లపై తరలించినా అడ్డుకునుడే.. 

గోదావరి, కిన్నెరసాని, తాలిపేరు లాంటి నదులు, వాగుల్లో నిత్యం ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. తక్కువ ధరకు వచ్చే ఇసుక ఇప్పుడు ట్రాక్టర్​ కు రూ.5వేల ధర పలుకుతోంది. దీనివల్ల వ్యాపారులు బాగుపడుతుండగా, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచ, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఇసుక పాలసీ ప్రకారం సులభతరంగా ఇసుకను అందించడం, ప్రభుత్వ ఆదాయానికి ఏ మాత్రం నష్టం కల్గకుండా చూడటం, ఇసుక రీచ్​ల్లో ప్రజాప్రతినిధుల జోక్యాన్ని నివారించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 

లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు...!

ప్రభుత్వ నిర్ణయంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. తవ్వకాలు, రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే సర్కారు తేల్చి చెప్పింది. కాంట్రాక్టర్లు వెళ్లి కలిసినా కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతుందని వారికి స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి బాధ్యతలను అప్పగించడంతో విజిలెన్స్, స్క్వాడ్​లు రంగంలోకి దిగాయి. ఓవరల్ లోడింగ్, సీరియల్​​ఛార్జీలు నిలిపివేశారు. 

ఆ ర్యాంపులతో ఆగిన అగ్రిమెంట్లు

జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్తగా మంజూరైన 17 ఇసుక ర్యాంపులతో అగ్రిమెంట్​ను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీఎండీసీని సర్కారు ఆదేశించింది. పినపాక నియోజకవర్గంలో 9, భద్రాచలం నియోజకవర్గంలో 8 ర్యాంపులకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువగా ఉందన్న ఫిర్యాదులు రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మణుగూరు మండలంలోని దమ్మక్కపేట, విజయనగరం-2, తిర్లాపురం, అనంతారం, పద్మగూడెం-1, పద్మగూడెం-2, బూర్గంపాడులో మోతెపట్టీనగర్​, కోయగూడెం, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలం నర్సాపురం-2, చర్ల మండలంలోని బీఎస్​ రామయ్య నగర్​, గొల్లగూడెం, జీపీ పల్లి, వీరాపురం, గొమ్ముగూడెం,మొగళ్లపల్లి, కుదునూరు, తేగడ ర్యాంపులు ప్రస్తుతం నిలిచిపోయాయి.